గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో అబుదాబిలో జైశంకర్ పర్యటన

UAE విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక దౌత్య చర్చలు

జనం న్యూస్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈ పర్యటనలో ఉన్నారు. యూఏఈ ప్రతినిధులతో ఆయన కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతంలో పర్యటించారు. శనివారం అబుదాబి చేరుకున్న ఆయన, యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన అత్యంత కీలక సమయంలో జరుగుతోంది. ఒకపక్క పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగానే.. ఇక్కడ ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, వాటి ప్రభావాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని జైశంకర్ తెలిపారు. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, యూఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అబుదాబి పర్యటనలో భాగంగా జైశంకర్ ముందుగా అక్కడి భారతీయ సంతతిని కలిశారు. ఈ సంక్షోభ సమయంలో వారి భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్థానిక సమాజాభివృద్ధిలో భారతీయుల పాత్రను ఆయన కొనియాడారు. అంతకుముందు మారిషస్‌లో జరిగిన 9వ హిందూ మహాసముద్ర సదస్సులో పాల్గొన్న జైశంకర్, అక్కడి నుంచి నేరుగా యూఏఈ చేరుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్, యూఏఈ దేశాల మధ్య అగ్ర నాయకత్వం స్థాయిలో ఎప్పటికప్పుడు సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా సాగే నౌకా రవాణాపై పశ్చిమాసియా యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఈ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు, గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇరాన్ దాడులతో నౌకల రాకపోకలకు ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంధన దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియాపైనే ఆధారపడటంతో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన 312 మంది భారతీయ జాలర్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆర్మేనియా మీదుగా వీరు తిరిగి వచ్చారని జైశంకర్ తెలిపారు. సహాయం చేసినందుకు ఆర్మేనియా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత వారమే 345 మంది జాలర్లను ఇరాన్ నుంచి భారత్ రప్పించింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *