ఇంటర్ విద్యార్థులపై లోకేశ్ స్పెషల్ ఫోకస్

ఐఐటీ, నీట్ టార్గెట్‌తో భారీ ప్లాన్!

జనం న్యూస్: ఏపీలో విద్యార్థులు ఐఐటీ, నీట్ ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. విద్యా ప్రమాణాలు మెరుగుదలే కూటమిప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. ఇంటర్మీడియట్,ఉన్నత విద్య, స్కిల్ డవలప్‌మెంట్ అధికారులతో సమీక్షించిన మంత్రి నారా లోకేశ్ ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐఐటి,నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70శాతానికిపైగా పూర్తయింది అని, ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండరు ప్రారంభమైందని, 6వతేదీ నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత టెక్ట్స్ బుక్స్ పంపిణీ 19నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అన్నిపాఠశాలలను త్రీస్టార్ కు చేర్చండి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కనీస మౌలిక సదుపాయాలు కల్పించి త్రీస్టార్ రేటింగ్ కు చేర్చాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనబడి – మన భవిష్యత్తు కింద రూ.2,034 కోట్లు సమీకరించాలని సూచించారు. ఇప్పటికే రూ.770కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి సారించాలని, విద్యాప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది వయోజన విద్యలో గణనీయమైన పురోగతి సాధించడం, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడంపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విద్యా సంవత్సరంలో 24,74,638మంది వయోజన విద్యాశాఖ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దీంతో గతఏడాది 73శాతంగా ఉన్న అక్షరాస్యత శాతం 83శాతానికి పెరిగినట్లు చెప్పారు. వచ్చేఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *