ఏపీలో అకాల వర్షాల ప్రభావం: 1215 హెక్టార్లలో పంట నష్టం, సహాయంపై సీఎం ప్రకటన

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఆరు జిల్లాలలోని 16 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది అని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు పూర్తిస్థాయి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గాలివానలు, వర్షాలు, వడగళ్లత కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము వంటి పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. మొత్తం 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయినట్టు చెప్పారు. అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని… మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ… అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రైతులకు పూర్తి సహాయం అందిస్తాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం/ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశముందని మంత్రి తెలిపారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు సూచనలు 1 పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలి 2. వడగళ్ల వాన, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో ఉండకూడదు 3.వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి 4.పండ్ల తోటలకు రక్షణ చర్యలు తీసుకోవాలి 5.పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదు, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలి ..ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అకాల వర్షాలతో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, పంటలు, ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *