అక్షర ఆయుధం: కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తెచ్చి.. గ్యాస్ కొరత లేకుండా చెయ్యాలని చూస్తోంది. కానీ బ్లాక్ మార్కెట్ అలాగే ఉంది. ఫలితంగా గ్యాస్ కొరత బాగా కనిపిస్తోంది. హోటళ్లు మూసేస్తే పెద్ద సమస్యే అవుతుంది. అప్డేట్స్ ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో గ్యాస్ కొరత లేదని చెబుతుంటే.. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో హోటళ్లను మూసేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకడం కష్టమైపోతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే గ్యాస్ కొరత సమస్య కనిపిస్తోంది. వంటగ్యాస్ బండ కోసం బుక్ చేస్తే.. వెయిటింగ్ తప్పట్లేదు. ఈ ప్రభావం హోటళ్లపై బాగా పడుతోంది. కమర్షియల్ అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ వాడేవారు.. ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధమైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంఘర్షణ వల్ల హార్ముజ్ జలసంధి వైపుగా దిగుమతులు నిలిచిపోయాయి. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో హోటళ్లు బంద్ పాటిస్తాయా?:హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఇక్కడ 75 శాతం తగ్గిపోయింది. సిలిండర్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది. తాము కూడా హోటళ్లు మూసేయాలా అనే టెన్షన్ పడుతున్నారు యజమానులు. కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పేయింగ్ గెస్ట్ (PG) హాస్టళ్లకు కూడా సిలిండర్లు సరిగా రావట్లేదు. 100 సిలిండర్ల కోసం ఆర్డర్లు వెళ్తే.. 20 నుంచి 25 మాత్రమే వస్తున్నాయి. దాంతో హాస్టళ్ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి సికింద్రాబాద్‌లో అత్యవసర సమావేశం పెట్టారు. “ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ చేస్తాం” అని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని 40,000 నుంచి 74,000 హోటళ్లు, కేఫ్‌ల దగ్గర ఉన్న గ్యాస్ ఒకటి, రెండు రోజుల వరకే రానుంది. సరిగ్గా రంజాన్ సీజన్లో ఈ కొతర ఏర్పడటం వారికి పెద్ద దెబ్బ. చిన్న టీ స్టాల్స్ నుంచి స్టార్ హోటళ్ల వరకు.. అంతటా మెను కట్ చేస్తున్నారు. ఎక్కువ సేపు వండే వంటల్ని బంద్ చేస్తున్నారు.