పయనించే సూర్యుడు న్యూస్ : ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించడానికి సంబంధించి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించడానికి సంబంధించి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా నిఖిల్ డే ప్రశంసించారు. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాజస్తాన్ ప్రభుత్వం చేపడుతున్న “జన్ సూచన పోర్టల్” తరహాలో తెలంగాణలోనూ ‘‘ప్రజా సూచన పోర్టల్’’ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా ఈ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక, తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్‌ను ఈ సందర్భంగా నిఖిల్ డే ప్రశంసించారు. ఈ చట్టం దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ఇదిలాఉంటే, సీఎం రేవంత్ రెడ్డి గురువారం రోజున శాసనమండలి సమావేశ హాలులో సీఎస్‌ఆర్ నిధులగపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు.ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందని తెలిపారు.ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్ లో పొందుపరచాలన్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ఆకర్షణీయంగా తయారు చేయాలని చెప్పారు. ఇక, జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల వాటా మన రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని… రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్ఆర్ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ నిధులు సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ వాటాను పెంచుకునేందుకు వీలుగా కొత్త పాలసీ ఉండాలని, కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధానాలను అనుసరించాలని చెప్పారు.