జనం న్యూస్ : బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్ మొదలయ్యే ముందే.. కంచుకోటలో దీదీకి ఊహించని షాక్ ఎదురైంది. తన సొంత ఇలాకాలో సభ నిర్వహిస్తున్న మమతా బెనర్జీకి.. కేవలం 100 మీటర్ల దూరంలోనే సువేందు అధికారి ర్యాలీ నిర్వహించారు. లౌడ్స్పీకర్ల చప్పుడు, మైకుల చప్పుళ్లతో దీదీ మాట్లాడే మాటలు ఎవరికీ వినిపించకుండా చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. స్టేజీ మీద నుంచి దిగి వెళ్లిపోయారు. సీఎం దిగిపోవడంతో.. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ ర్యాలీ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ లాంటి భవనీపూర్ నియోజకవర్గంలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సభకు కేవలం 100 మీటర్ల దూరంలోనే బీజేపీ నేత సువేందు అధికారి ర్యాలీ నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ శ్రేణుల నినాదాలు, లౌడ్స్పీకర్ల హోరుతో అసహనానికి గురైన మమతా బెనర్జీ.. తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించి వేదిక దిగి వెళ్లిపోయారు. 100 మీటర్ల దూరంలో హోరాహోరీ.. శనివారం సాయంత్రం భవనీపూర్లోని చక్రబేరియా రోడ్డు వద్ద తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే.. సమీపంలోనే బీజేపీ కార్యకర్తలు భారీ శబ్దంతో ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ లౌడ్స్పీకర్ల గోల వల్ల తన మాటలు ప్రజలకు వినబడటం లేదని, ఇది కావాలని చేస్తున్న కుట్ర అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా గొంతును నొక్కేయాలని చూస్తున్నారు” అని వ్యాఖ్యానిస్తూ.. అక్కడికి వచ్చిన ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆమె సభ నుంచి నిష్క్రమించారు. రణరంగంగా మారిన వీధులు.. మమతా బెనర్జీ వెళ్లిపోయిన వెంటనే భవనీపూర్ వీధులు రణరంగంగా మారాయి. సువేందు అధికారి సభ జరుగుతున్న ప్రాంతానికి టీఎంసీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అటు బీజేపీ, ఇటు టీఎంసీ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఎదురు పడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాలు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. “ఓటమి భయంతోనే దీదీ పరార్”: బీజేపీ ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే సహనం కోల్పోయి సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. మరోవైపు సువేందు అధికారి మాట్లాడుతూ.. బెంగాల్లో టీఎంసీ గూండాగిరి చేస్తోందని, త్వరలోనే వారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని మండిపడ్డారు.