జనం న్యూస్: ఏపీలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి అని ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మలేరియా రహిత జిల్లాలుగా బాపట్ల, పశ్చిమగోదావరి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ ఉన్నాయని త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా జ్వరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపబోతున్నామని ప్రకటించారు. 2024-25 నుంచి మలేరియా జ్వరాల కేసులు రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. 2024-25లో 7,871 మలేరియ కేసులు రాగా, 2025-26లో 7,199 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు (16 వారాలు) 899 కేసులు నమోదైనట్లు చెప్పారు. కిందటేడాది ఇదే సమయంలో 1,783 కేసులు వచ్చాయన్నారు. 2030 నాటికి మలేరియా కేసులు గణనీయంగా తగ్గించేందుకు పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు చేడుతున్నామని తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటన జారీచేశారు. వర్షాలు పురస్కరించుకుని దోమల వ్యాప్తి నిరోధక ‘స్ప్రే’ కార్యక్రమాలు రాబోయే వర్షాలు దృష్టిలో ఉంచుకుని‘ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే’ కార్యక్రమాన్ని చేబట్టబోతున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇళ్లల్లోని గోడలు, పైకప్పు భాగంలో క్రిమి సంహర క మందును స్ప్రే చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వీలవుతుందని వెల్లడించారు. క్రిమిసంహారక మందు కొనుగోలు, పిచికారీ, ఇతర ఖర్చుల కింద కలిపి ఏడాదికి రూ.10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని తెలిపారు. మలేరియా జ్వరాల కేసులు అధికంగా ఉండే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో ‘స్ప్రే’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సదరు ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ‘స్ప్రే’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి చేపట్టామని తెలిపారు. ఇవి కాకుండా ఎంపికచేసిన మరో 13 జిల్లాల్లోనూ మే 15 నుంచి దశల వారీగా ప్రారంభించి, ఆగస్టు 30 నాటికి ‘స్ప్రే’ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మర్కాపురం, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ స్ప్రే కార్యక్రమ నిర్వహణకు రూ.4.5 కోట్లు, పిచికారి మందు కొనుగోలు కోసం రూ.4.80 కోట్ల వరకు (అల్ఫా సైపర్ మెత్రిన్, మలాథియాన్ మందు ) ఖర్చు పెడుతున్నామన్నారు. ఇతర ఖర్చుల కింద కలిపి మొత్తం రూ. 10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.