నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

త్వరలో జీఓలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో ముఖ్యమంత్రి నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఉదయం ప్రారంభమైన ఈ భేటీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ప్రధానంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ బలోపేతం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా నిలిచాయి. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు, పార్టీ పరంగా ఒక స్పష్టమైన పోరాట కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. జనాభాతో పాటు అభివృద్ధి, ఇతర భౌగోళిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు జరగాలనేది ఈ మోడల్ సారాంశం. ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజలకు దీనివల్ల జరిగే నష్టాన్ని వివరించాలని సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలనలో, పార్టీలో చురుగ్గా ఉండేలా చూసేందుకు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, నమ్మకమైన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ కోరారు. ఇప్పటికే కార్పొరేషన్ ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పనితీరును సమీక్షించి, సమర్థులైన వారికి పదవీకాలం పొడిగించడం లేదా కొత్త వారికి అవకాశం కల్పించడంపై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరో 2-3 రోజుల్లో జీవోలు వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను ఎదుర్కోవడానికి మరియు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలోనే, వారం రోజుల్లోగా రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశం పార్టీ బలోపేతానికి అత్యంత కీలకం కానుంది. వచ్చే పీఏసీ సమావేశంలో కేబినెట్ విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు జిల్లా స్థాయి కమిటీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపడమే కాకుండా, రాబోయే రాజకీయ సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *