మాజీ మంత్రి పేర్ని నానిపై మరో పోలీసు కేసు నమోదు

జనం న్యూస్: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై చిలకలపూడి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై చిలకలపూడి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై అధికారులు కూల్చివేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తొలుత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పేర్ని నాని తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అధికారులపై చిందులు తొక్కారు. అధికారులను, పోలీసులను తీవ్రంగా బెదిరించారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవ్వరినీ వదలమని, అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మీ పాపాలు లెక్క పెట్టుకో… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పేదల ఇళ్ళను కూల్చేసిన పాపం కొల్లు రవీంద్రను ఊరికే వదిలిపెట్టదని అన్నారు. ఇళ్లను కూల్చి వారి గుండెల్లో దింపిన గునపాల బాధను కొల్లు రవీంద్రకు తెలిసేలా చేస్తానని అన్నారు. కూటమి నేతల ఆదేశాల మేరకు అధికారిక యంత్రాంగం కూడా పేదలపై చేస్తుందని ఆరోపించారు. ఈ చర్యలపై అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కూటమి నేతలు ఎల్లకాలం పదవులు అధికారం శాశ్వతం కాదనే వాస్తవాన్ని గుర్తించుకోవాలని అన్నారు. కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్న అరాచకాలకు సమాధానం చెప్పించి తీరతామని చెప్పారు. ఇళ్ళను కూల్చిన అధికారులను, దానికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులను విడిచి పెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. బాధితులకు అండగా న్యాయపోరాటం సైతం సాగిస్తామని తెలిపారు. అయితే పేర్ని నాని, పేర్ని కిట్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిమే కాకుండా… వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పేర్ని నాని, పేర్ని కిట్టు అనుచితంగా ప్రవర్తించారని కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు తెలిపారు. మచిలీపట్నం పరిధిలోని కొబ్బరితోటలో ఒక ఇంటి కూల్చివేత ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని… ఈ సందర్భంగా రక్షణ కల్పించాల్సిందిగా అధికారులు పోలీసులను కోరడం జరిగిందని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారని అన్నారు. పోలీసు శాఖ స్వతంత్రంగా పనిచేస్తుందని, రాజకీయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వాస్తవాలను అర్థం చేసుకోవాలి తప్ప, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. ప్రజల భద్రత, రక్షణ పట్ల పోలీసు శాఖ కట్టుబడి ఉందని అన్నారు. ఈ క్రమంలోనే పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *