మహిళా బిల్లుకు వ్యతిరేకంగా నిలిచిన విపక్షాలు పరిణామాలు ఎదుర్కోవాల్సిందే

విపక్షాలకు భారీ మూల్యం తప్పదని ప్రధాని మోదీ హెచ్చరిక

పయనించే సూర్యుడు న్యూస్ : మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భవిష్యత్తు కోసం ఉద్దేశించిన అత్యంత కీలకమైన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు విపక్షాలు భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు సభలో తగిన సంఖ్యాబలం లభించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను కాలరాసిన ఏ రాజకీయ పార్టీని వారు ఎన్నటికీ క్షమించరని గతాన్ని గుర్తు చేశారు. జాతీయ విధాన నిర్ణయాల్లో దేశ జనాభాలో సగభాగమైన మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని, కానీ కేవలం తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం అనేది ఒక రాజకీయ అంశం కాదని, అది వారి ప్రాథమిక హక్కు అని ప్రధాని సభలో స్పష్టంగా తేల్చి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును రాజకీయం చేయవద్దని మోదీ సభలో పదేపదే విజ్ఞప్తి చేశారు. పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి తీరని అన్యాయం జరుగుతుందన్న విపక్షాల వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. కొత్త విధానం వల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ నష్టం వాటిల్లదని తాను బాధ్యతతో సభ ముఖంగా హామీ ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. నిరాధారమైన అపోహలతో మహిళా సాధికారతకు ఆటంకం కలిగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని కూడగట్టడంలో అధికార పక్షం విఫలమైంది. సభలో జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే కూటమికి 298 ఓట్లు రాగా, విపక్ష ఇండియా కూటమికి చెందిన 230 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లుకు ఎవరూ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇది దేశ సమష్టి నిర్ణయంగా నిలుస్తుందని ప్రధాని ముందుగానే సూచించారు. అయినా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించడం పట్ల దేశవ్యాప్తంగా మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కొత్త బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816 కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే పాత బిల్లునే యథాతథంగా అమలు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ ఆకస్మిక పరిణామాలతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అర్థాంతరంగా నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఈ తీరుపై ఏ విధంగా స్పందిస్తారో అన్నది దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ప్రసంగంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *