జనం న్యూస్ : బయ్యారంలో సమృద్ధిగా ఐరన్‌ఓర్ నిల్వలున్నాయని ఈ క్రమంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలి అని కేంద్రమంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సీఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వలన దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబద్ కేంద్రంగా నిలవగలదని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో ఈ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయండి హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయనే ప్రచారం ఉంది. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అయ్యింది. అయితే బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై 11అడుగుల పనికూడా జరగలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై శీతకన్ను వేసిందనే విమర్శలు ఉన్నాయి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నప్పటికీ, కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోవడం తెలంగాణపై వివక్షకు నిదర్శనంగా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బయ్యారంలో ఐరన్ ఓర్ నిల్వలు ఇదిలా ఉంటే బయ్యారం ప్రాంతంలో 1.41 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నట్టు గతంలో అధికార యంత్రాంగం గుర్తించింది.