
సాక్షి డిజిటల్ న్యూస్: ఏపీ మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేశ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ను పలువురు టీడీపీ సీనియర్ నేతలు అభినందనలతో ముంచెత్తారు. నారా లోకేశ్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేశ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకార చేయడం హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు నారా లోకేశ్‌ను అభినందించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలోనూ నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న ప్రస్తుత కమిటీలోనూ పార్టీ సీనియర్ నేతలు అయిన యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కీలక బాధ్యతల్లో ఉండటం విశేషం. అవమానాలు మెట్టుగా మార్చుకున్న లోకేశ్ ఇకపోతే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.రాజకీయం అంటే వారసత్వం కాదు రాజకీయం అంటే నిరంతర పోరాటం అని లోకేశ్ పొలిటికల్ కెరీర్‌లో నిరూపితం అయ్యింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నప్పటికీ లోకేశ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు చేసే ఒక్కో విమర్శను తట్టుకుని నిలబడ్డారు. అలా నారా లోకేశ్ తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఆయుధంగా మెట్టుగా మార్చుకుని నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. పొలిటికల్ కెరీర్‌ను మార్చేసిన యువగళం నారా లోకేశ్ రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా...టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు చేపట్టిన యువగళం పాదయాత్ర లోకేశ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఎండలు మండినా..వానలు ముంచెత్తినా ప్రత్యర్థులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, మైకులు లాగినా స్టూళ్లు సైతం లాగేసుకున్నా ఏ మాత్రం బెదరలేదు నారా లోకేశ్.తన పాదయాత్రలో లక్షలాది మంది ప్రజల కన్నీళ్లను తుడుస్తూ వేలాది మండి కార్యకర్తలకు భరోసా ఇస్తూ కుప్పం నుంచి విశాఖపట్నం వరకు దాదాపు 3132 కిలోమీటర్ల మేర నారా లోకేశ్ ఈ యువగళం పాదయాత్ర చేశారు. అపజయాలే నిచ్చెన మెట్లుగా మలచుకున్నారు నారా లోకేశ్. 2019 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు.తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగిన నారా లోకేశ్‌ను ఓటమి ఆహ్వానించడంతో ఏమాత్రం కృంగిపోలేదు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. ఆ అపజయాన్నే విజయానికి నిచ్చెనగా మలచుకున్నారు. ఎక్కడ అయితే ఓడిపోయామో అక్కడ గెలవాలనే సంకల్పంతో తీవ్రంగా కృషి చేశారు. అదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో జల్లెడపట్టేశారు. మంగళగిరిలోనే మకాం వేసి ప్రతీ ఇంటిని తట్టారు. ప్రతీ గుండెను పలకరించారు. దీంతో 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో అత్యంత కీలకమైన ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు అయ్యారు.