బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగింపు… ఎల్లుండి చివరి విడత పోలింగ్ నిర్వహణ

ఫైనల్ కౌంట్‌డౌన్ స్టార్ట్... ఎల్లుండి బెంగాల్ తీర్పు!

పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత ప్రచారం నేటితో ముగిసింది. దీంతో గత నెల రోజులుకు పైగా హోరా హోరీగా సాగిన ప్రచారానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత ప్రచారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. దీంతో గత నెల రోజులుకు పైగా హోరా హోరీగా సాగిన ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. బెంగాల్‌లె మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఈరోజు సాయంత్రం ముగిసింది. రెండవ దశలో పోలింగ్ జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్‌కతా నార్త్, కోల్‌కతా సౌత్, హౌరా, నాదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, పూర్వ బర్ధమాన్‌ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని ప్రధాన పార్టీల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాయి. రెండో విడత ప్రచారంలో చివరి రోజైన నేడు బీజేపీ సీనియర్ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బారక్‌పూర్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈరోజు తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. ఇక, బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య హోరా హోరీ పోరు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో మరోసారి అధికారంలో కొనసాగేలా మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తుండగా... ఈసారి ఎలాగైనా బెంగాల్ అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ నాయకుల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు ప్రమోద్ తివారీ, అఖిలేష్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో తమ పార్టీ బలంగా రాణించిందని... రాష్ట్రంలో టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి తృణమూల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో బీజేపీ 125 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ ఎన్నికల పోలింగ్‌లో 93.19 శాతం రికార్డు ఓటింగ్ నమోదు అయింది. గతంలో ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాలేదు. దీంతో బెంగాల్‌లో రెండో విడతలో ఏమేరకు పోలింగ్ శాతం నమోదవుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.