బీఆర్‌ఎస్‌ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

బీఆర్‌ఎస్ పరిస్థితిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారి

పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకే మనుగడ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గతం ఉందని, భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఎలా మాట్లాడినా ప్రజలు సహించారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలానే మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెచ్చిపెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని... రంగు, రుచి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును తాము ఎప్పుడూ కోరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ ఆస్పత్రిలో చేరితే మొదట కలసి వచ్చింది తానేనని చెప్పారు. కేసీఆర్ చనిపోతే తనకేం వస్తుంది?... ఆయన ఆస్తులు, ఫార్మ్ హౌజ్ తనకు రావు కదా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని అన్నారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజా ప్రతినిధి అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మర మనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలియాలని అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని కేసీఆర్ దేవుడి మీద ఒట్టు వేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్‌పైరీ గడువు ముగిసిందని... ఆ పార్టీతో పనిలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన శవానికి వైద్యం చేసినా వృధా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‎కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని.... కుటుంబ అవసరాల కోసమే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఉండగానే బాహాటంగా కేటీఆర్ సీఎం అని పార్టీలో చర్చ మొదలు పెట్టారన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీకే దిక్కు లేదని... రాష్ట్రంలో ఇంకా కొత్త పార్టీకి ఏం పని అని కవిత కొత్త పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న పార్టీనే (బీఆర్ఎస్) ఉంటుందా పోతుందా తెల్వదని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో తలెత్తిన పంపకాల గొడవ తమపై రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వారసత్వ సంపద కోసమే ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తనకు శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే, సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌లతో కలిసి సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని చెప్పారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు.