
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై అధికారులతో చంద్రబాబు నాయుడు సోమవారం రోజున టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను, మంత్రులను ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని చెప్పారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇక, పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రోజున అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి వారితో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రిటైల్ ఔట్ లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో సాధారణగా పెట్రోల్ రోజుకు 6,330 కేఎల్ అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కసారిగా 34 శాతం డిమాండ్ పెరిగి 8,489 కేఎల్‌కు అమ్మకాలు చేరాయని, ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 22 శాతం అధికంగా 7,750 కేఎల్ వినియోగం ఉందని సీఎం చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. మరోవైపు కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు తెలుపగా... ఎందుకు క్రెడిట్ నిలిపేశారని హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు స్పందించారు. సోమవారం ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకూ రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.