హైదరాబాద్‌లో లూజ్ వంటనూనెల విక్రయాలపై నిషేధం: అధికారుల ఆదేశాలు

* వ్యాపారులకు 15 రోజుల గడువు ఇచ్చిన హెచ్‌ఫాస్ట్ హైదరాబాదులో వంటనూనెల అమ్మకాలపై కొత్త నిబంధనలు.. అధికారులు అలర్ట్
★ హైదరాబాద్‌లో వంట నూనెల కల్తీ దందాకు చెక్ ★ హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. లూజ్ వంటనూనెలపై నిషేధం.. అధికారుల తక్షణ ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో ఆహార ఉత్పత్తుల కల్తీ తీవ్ర సమస్యగా మారుతోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. కల్తీ నూనెలు భారీ మొత్తంలో పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో విడిగా వంట నూనెలను విక్రయించడంపై నిషేధం విధించింది. 15 రోజుల్లోగా విడి నూనెల అమ్మకాలను నిలిపేయాలని వ్యాపారులను ఆదేశించింది. ఇక నుంచి ప్యాకెట్లు, టిన్‌లలో మాత్రమే వంట నూనెలను విక్రయించాలని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆహార పదార్థాల కల్తీ సమస్య తెలంగాణలో తీవ్రమవుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. టీపొడి, మంచి నూనె, కొబ్బరి నూనెలు, టూత్ పేస్టులు.. ఇలా అన్ని రకాల వస్తువులను కల్తీ చేస్తున్నారు. ఇక వంట నూనెలను అయితే ఇష్టం వచ్చినట్లు కల్తీ చేస్తున్నారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఇటీవల భారీ మొత్తం కల్తీ నూనెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ టీమ్) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో లూజ్‌ (విడి)గా వంట నూనెలు విక్రయించడాన్ని నిషేధించింది. ఇక నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో మాత్రమే వంట నూనెను విక్రయించాలని ఆదేశించింది. విడిగా నూనె విక్రయాలను ఆపేయడం కోసం వ్యాపారులకు సౌత్ జోన్ డీసీపీ, హెచ్‌ఫాస్ట్ ఇంఛార్జ్ అయిన గైక్వాడ్ వైభవ్ 15 రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా సీల్ చేసిన, బ్రాండెడ్ ఉత్పత్తుల వైపు మళ్లాలని వ్యాపారులను ఆదేశించింది. నూనె రిఫైనరీలు, నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన సూచించారు. 15 రోజుల డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా ఖుల్లాగా వంట నూనెలు విక్రయించే వారిపై భారత న్యాయ సంహిత, ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్‌ఫాస్ట్ ఇంఛార్జ్, డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. బేగం బజార్‌లోని నూనె వ్యాపారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు ఇక నుంచి వంట నూనెలను సీల్ చేసిన ప్యాక్‌లు, టిన్నుల్లో మాత్రమే విక్రయించాలి. అలాగే తయారు చేసిన తేదీ, ఎప్పటిలోగా వాడాలి, బ్యాచ్ నంబర్, ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. వంట నూనెల కల్తీకి పాల్పడిన వారు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, వారి లైసెన్స్ కూడా రద్దవుతుంది. తక్కువ ధరలకు వస్తున్నాయనే ఆశకు పోయి వినియోగదారులు విడిగా లభించే వంట నూనెలను కొనుగోలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. విడిగా లభించే వంట నూనెలను కల్తీ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆర్జిమోన్ నూనె అనేది అచ్చం ఆవ నూనెలాగే ఉంటుంది. చౌకగా దొరికే ఈ నూనెను ఖరీదైన ఆవ నూనెలో కలుపుతుంటారు. అలాగే తక్కువ ధరకే దొరికే పామ్ ఆయిల్‌ను ఖరీదు ఎక్కువగా ఉండే వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల్లో కలిపి కల్తీ చేస్తుంటారు. హోటళ్లు, ఫంక్షన్లలో పదే పదే మరిగించిన నూనెను కొనుగోలు చేసి రసాయనాలతో శుద్ధి చేసి, కొత్త నూనెలలో కలిపి విక్రయించేవారు కూడా ఉంటారు. కల్తీ నూనెలు వాడటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకర ప్రాణాంతక వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంటుంది.