
పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమాసియాలో ఇంధన రవాణాకు అత్యంత ముఖ్యమైన హర్మూజ్ జల సంధి వద్ద పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. జల సంధిలో బుధవారం రెండు ట్యాంకర్లను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. వీటిలో దుబాయ్ నుంచి చమురుతో గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌక ఒకటి. ఈ రెండింటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెంబడించి, అదుపులోకి తీసుకుంది. అయితే, దీనికి సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఈ వీడియో హాలీవుడ్ రేంజ్ సినిమా తలదన్నేలా ఉండటం గమనార్హం. అమెరికా దిగ్బంధనం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులతో హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. బుధవారం హర్మూజ్‌లో భారత్‌లోని గుజరాత్‌కు వస్తున్న వాణిజ్య నౌక సహా రెండు నౌకలను ఐఆర్జీసీ నేవీ స్వాధీనం చేసుకుంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, ఆ నౌకలను ఛేజ్ చేసిన పట్టుకున్న వీడియోను ఇరాన్ అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. మాస్క్‌లు ధరించిన కమాండోలు రెండు నౌకలను వెంబడించి, ఎలా స్వాధీనం చేసుకున్నదీ చూపించే వీడియోను బయటపెట్టింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా ఈ ఛేజింగ్ సాగడం గమనార్హం. ఇదిలా ఉండగా, అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నా ఇరాన్ నౌకలు.. వాటిని తప్పించుకుని చమురును విజయవంతంగా తరలించడం గమనార్హం. రెండు నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోలేదని, నిబంధనలను ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. నావిగేషన్ వ్యవస్థలను ఏమార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఆరోపించింది. పనామా జెండా ఉన్న 'MSP ఫ్రాన్సెస్కా', లైబీరియా జెండా ఉన్న 'ఎపామినోండాస్' నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. వీటిలో 'ఎపామినోండాస్' వాణిజ్య నౌక దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తోంది. స్పీడ్ బోట్ల ద్వారా చేరుకున్న ఇరాన్ సైనికులు.. మాస్క్‌లు ధరించి, ఆయుధాలతో నౌకల పైకి ఎక్కారు. అనంతరం ఆ కమాండోలు నౌక డెక్‌పైకి వెళ్లడం కనిపిస్తోంది.అయితే, అంతకు ముందు ఈ నౌకపై కాల్పులు జరిపి, గ్రనేడ్లు విసిరారు. దీంతో నౌకలోని సెంట్రల్ కమాండ్ సెంటర్ దెబ్బతింది. అయితే, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. వారు క్షేమంగానే ఉన్నారు. ఈ పరిణామం ఇరాన్, భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనికి రెండు రోజుల ముందు కూడా భారత్ జెండా ఉన్న నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇక, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం నిరవధికంగా పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌కు వస్తున్న నౌక సహా రెండు ట్యాంకర్లను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. అయితే, ఇరాన్ జలాల్లో మాత్రం అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది.