తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్‌డేట్

అక్షర ఆయుధం : తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ పదో తరగతి పరీక్షలు- 2026ను ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ పదో తరగతి ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్‌ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.... తెలంగాణ పదో తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు నిర్వహించారు. ఆయా తేదీలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రస్తుతం కొనసాగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది కూడా ముగింపు దశకు చేరినట్టుగా తెలుస్తోంది. మరో నాలుగైదు రోజులలో సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ వెంటనే... మార్కుల క్రోడీకరణ చేపట్టడంతో పాటు రిజల్ట్స్ విడుదల చేసేందుకు రంగం సిద్దం కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం... తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే మే 4 లేదా 5వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖ ఫలితాలు విడుదల చేసిన తర్వాత విద్యార్థులు... అధికారిక వెబ్‌సైట్స్ https://bse.telangana.gov.in/ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ పదో తరగతి ఫలితాలకు సంబంధించి గత కొన్నేళ్లు గ్రేడ్‌లు ఇచ్చేవారు. అయితే గతేడాది నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇస్తున్నారు. అయితే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలాఉంటే, తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 66.2 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకునేవారి, ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంది. జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థు లందరికీ ఈ అవకాశం వర్తిస్తుంది. ఇక, గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు 2025ను ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 92.78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక, 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే రెండు పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఫలితాలు పొందాయి.