
సాక్షి డిజిటల్ న్యూస్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పలు డిపోల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రెండో రోజు కూడా బస్సులు డిపోలకు పరిమతమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. అయితే ఈ బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ. అద్దె బస్సులను, ఎలక్ట్రిక్ బసులను పోలీసు బందోబస్తుతో రోడ్ల మీదకు తీసుకొస్తుంది. అయితే కండక్టర్లు లేకపోవడంతో బుధవారం రోజున చాలా చోట్ల బస్సులలో టికెట్లు తీసుకోకుండానే బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పలు డిపోల అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే ప్రక్రియను చేపడుతున్నారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అర్హతల విషయానికి వస్తే డ్రైవర్ పోస్టులకు హెచ్ఎంవీ ఒరిజినల్ లైసెన్సు, 18 నెలల అనుభవం ఉండాలి. కండక్టర్ పోస్టులకు 10వ తరగతి పాసై ఉండాల్సి ఉంది. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా డిపోలలో సంప్రదించాల్సి ఉంటుంది. ఇక, తాత్కాలిక ప్రతిపాదికన నియమించే డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల భర్తీకి సంబంధించి పత్రిక ప్రకటనలు విడుదల చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా డిపోలలో సంప్రదించాలని కోరుతున్నారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ఎంపికలో అధికారులు పలు అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్లు వాహనం నడిపేతీరును పరిశీలించిన తర్వాత బస్సులు అప్పగిస్తున్నారు. కండక్టర్ పోస్టులకు ఎంపికైనవారికి టికెట్ జారీపై అవగహన కల్పిస్తున్నారు. ఇక, టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీలో ఏప్రిల్ 22 నుంచి సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం నియమించిన కమిటీతో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అద్దె బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్నారు. దీంతో ప్రధాన పట్టణాల మధ్య మాత్రమే కొన్ని బస్సులు తిరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటం. నడుస్తున్న కొద్ది బస్సులు ఎప్పుడస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక మొత్తం చెల్లించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇక, హైదరాబాద్ నగరంలో ప్రయాణికులు మెట్రో సర్వీసుల, క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అయితే క్యాబ్, ఆటోల డ్రైవర్లు సాధారణం కంటే రెట్టింపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.