
సాక్షి డిజిటల్ న్యూస్ : రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు రాజకీయ సెగలు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సోమవారం జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. జీవన్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డిని 75 ఏళ్ల నవ యువకుడిగా అభివర్ణించడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. హీట్ సమ్మర్లో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. భూపాలపల్లి జిల్లాలో అధికార కాంగ్రెస్ సభను నిర్వహించింది. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సభపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె సెటైర్లు వేశారు. 75 ఏళ్లు వచ్చిన వ్యక్తిని నవ యువకుడిగా అభివర్ణిస్తే.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏమవ్వాలి? అని కవిత ప్రశ్నించారు. యువత ఆకాంక్షలను గుర్తించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ తన సభలో ప్రజలకు 'ఉట్టి కథలు' చెప్పారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారని అనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి వారిని తప్పుబట్టడం సరికాదని ఆమె మండిపడ్డారు. 'బీఆర్ఎస్ పార్టీ ఉట్టి కథలు చెప్పింది. కాంగ్రెస్ పార్టీనేమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల కష్టాలను మాత్రం ఎవరూ చెప్పలేదు. జగిత్యాలలో 75 ఏళ్ల కురువృద్ధుడిని పార్టీలో చేర్చుకున్నారు. మరి ఈ సభతోని.. మీకే 25 ఏళ్లు తగ్గిపోయినయ్.. మీరే నవ యువకుడు.. మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్పిన్రు. మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా సచ్చిపోయిన్రా.. బతికున్నరా..? వాళ్ల ప్యూచర్ ఏంది..? వాళ్ల కథేంది అనేది నాకైతే అర్థం కాలేదు. అందుకే నేను అందర్ని ఆహ్వానిస్తున్నా.. కొత్తగా మేం పెట్టబోయే పార్టీలో యూత్‌కు అవకాశాలు ఉంటయ్. యూత్ పార్టీగా మేం ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడలేదు. ఆడ బిడ్డలకు భరోసా ఇవ్వలేదు. ఆ పార్టీలో మహిళలకు ఎలాగూ గౌరవం ఉండదు. కనీసం మహిళా రిజర్వేషన్లపైనా మాట్లాడాల్సి ఉంది. మా ఓటమి మీరే కారణమన్నట్లు ప్రజల్ని తప్పుబడుతున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని తెలంగాణ పునర్నిర్మాణం అని మాట్లాడుతున్నారు. ఇది దారుణం.' అని కవిత కీలక కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల గొంతుకను వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు, యువతకు తన కొత్త రాజకీయ ప్రయాణంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా పబ్లిసిటీ మెటీరియల్, ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్యంలో కొత్త శక్తులు ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు.