
అక్షర ఆయుధం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం సాయంత్రం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభా వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే చాలా నెలల తర్వాత కేసీఆర్ ఒక బహిరంగ సభకు హాజరుకావడంతో ఈ సభ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సభా వేదికగా కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. అయితే తెలంగాణలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కీలక సభకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అయితే కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారని... అందుకే జగిత్యాలలో జరిగిన కేసీఆర్ సభకు హాజరుకాలేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తీవ్రమైన వడదెబ్బతో కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నాయి. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి వెళ్లిందని ఆ పార్టీ తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు ఢిల్లీ వెళ్లారని పేర్కొంది. ఈ క్రమంలోనే వారు సోమవారం సాయంత్రం ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో సమావేశమయ్యారని తెలిపింది. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో.. సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలతో పాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా బీఆర్ఎస్ సభ్యులు చర్చించారని పేర్కొంది. అయితే ఈ సభా వేదికగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఈరోజు సభకు కేటీఆర్, హరీష్ రావులు రావల్సి ఉందని అన్నారు. అయితే వారికి వేరే బాధ్యతలు అప్పగించడం వల్ల ఈరోజు సభకు రాలేకపోయారని చెప్పారు. ఈ సభ ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్, హరీష్ రావులు అని తెలిపారు. ఇదిలాఉంటే, ఈ సభావేదికగా కేసీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎదవలు చావాలంటే కేసీఆర్ ఛస్తాడా అని ప్రశ్నించారు. ‘ నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. నా కొడకా ఏం అనుకుంటున్నావో’ అని మండిపడ్డారు. ‘ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెట్టేవారు. ఆ ఉట్టి పిల్లికి అందదు. అందుకే పిల్లి శాపం పెడతది. తాడు తెగాలి. ఉట్టి పడాలి అని శాపం పెడతది. పిల్లి శాపానికి ఉట్టి పడతదా.. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా.. ఈ ఎదవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా ‘ అని కేసీఆర్ ప్రశ్నించారు. .బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని చెప్పారు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 46వేల చెరువులు మంచిగా చేశామని.. కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.