రైతులకు ఊరటగా రైతుభరోసా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ జమ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలోని రైతన్నలకు గుడ్ న్యూస్. రైతు భరోసా రెండో విడత నిధులను సోమవారం విడుదల చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని రైతన్నలకు గుడ్ న్యూస్... రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం (ఏప్రిల్ 20) రోజున విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 6,000 చొప్పున నిధులు జమకానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ప్రారభించారు. మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారు రూ.3,446.94 కోట్లను సీఎం విడుదల చేశారు. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా రైతు భరోసా రెండో విడత నిధులను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ. 2,206.06 కోట్ల విడుదల చేయనున్నారు. ఇక, మూడో విడతలో మిగిలిన రైతులు ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమచేయనున్నారు. మొదటి విడతలో రూ.3,446.94 కోట్ల, రెండో విడతలో రూ. 2,206.06 కోట్ల కలిపి. రెండు విడతల్లో మొత్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.5,653 కోట్లు చేరనున్నాయి. ఇక, మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. రెండో విడత నిధులను సోమవారం విడుదల చేస్తుండగా వీలైనంత త్వరగా మూడో విడత నిధులను కూడా విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతు భరోసా గురించి. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు పేరుతో వానాకాలం, యాసంగి సీజన్‌కు కలిపి ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో ఎవానాకాలం, యాసంగి సీజన్‌కు కలిపి రూ. 12 వేలు అందించనున్నట్టుగా ప్రకటించింది. రైతు భరోసా నిధులు ఎలా చెక్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేసిన తర్వాత... అర్హులైన రైతులకు దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నంబర్లు మెసేజ్‌లు వస్తాయి. తద్వారా రైతులు తమ అకౌంట్లలో రైతు భరోసా నిధులు పడ్డాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా తమ అకౌంట్‌లలో నిధులు జమ అయ్యాయా? లేదా? అనేది తెలుసుకునే వీలు ఉంది. ఒకవేళ ఏదైనా సందేహలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.