
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, విజయ్ నేతృత్వంలోని టీవీకేల మధ్య పోటీ నెలకొని ఉంది. అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి భాగస్వామిగా చంద్రబాబు, టీడీపీ నేతలు గతంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పడు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం కలిసివస్తుందని ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 21 తేదీల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు సోమవారం (ఏప్రిల్ 20) ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరి వెళ్తారు. రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై మధురై తదితర ప్రాంతాల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వివిధ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్న చంద్రబాబు... ఎన్డీయే అభ్యర్థులకు ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎన్డీయే శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు తన పర్యటనలో తొలి రోజైన సోమవారం నాడు కోయంబత్తూరులో ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హోసూర్, తళ్లికి వెళ్లనున్నారు. అక్కడ చంద్రబాబు మరో బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం చెన్నై చేరుకుని ఆవడిలో జరిగే భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలతో ప్రజలు, ఎన్డీయే మద్దతుదారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.ఇక, రెండో రోజైన మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు మదురైని సందర్శించి, సత్తూరుకు వెళ్తారు. అక్కడ ఆయన కమ్యూనిటీ లీడర్స్‌తో సమావేశమై ఒక కీలక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత చంద్రబాబు మంగళవారం సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 మంది సభ్యులు ఉన్నారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమికి అన్నాడీఎంకే-బీజేపీలతో ఎన్డీయే కూటమికి మధ్య ప్రదాన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా... మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.