అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా ఫ్రీ భోజనాలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లు రూ. 5కే పేదల ఆకలి తీర్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్న క్యాంటీన్లకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి భారీ విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లు రూ. 5కే పేదల ఆకలి తీర్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్న క్యాంటీన్లకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి భారీ విరాళం అందజేశారు. నారా భువనేశ్వరి గతంలో అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం అందించారు. అయితే తాజాగా అన్న క్యాంటీన్లకు భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళం అందించారు. ఏప్రిల్ 20వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు విరాళం అందజేశారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో రూ. 76 లక్షల విరాళం చెక్‌ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని ఈ సందర్భంగా భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని...లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. రూ. 5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అన్నారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని... ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని భువనేశ్వరి కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి ఒక్క రోజు అయ్యే మొత్తం విరాళంగా ఇస్తున్న విషయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది చంద్రబాబుకు పుట్టిన రోజుకు తామిచ్చే బహుమానం అని వ్యాఖ్యానించారు. అన్న క్యాంటీన్లకు విరాళం అందజేసిన తన సతీమణి భువనేశ్వరిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోందని చెప్పారు. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. నాణ్యతను పాటించడంతో పాటు పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలని అన్నారు.