తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

అక్షర ఆయుధం : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రాజ్యంగ (131 సవరణ) బిల్లు లోక్‌సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో వీగిపోయిన సంగతి తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్ల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. దీంతో మరో రెండు బిల్లును కేంద్రం ఉపసంహరించు కుంది. అయితే ఈ పరిణామాలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని మండిపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేపట్టనున్నట్టుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లకుండా రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటి వద్దే గృహ నిర్బంధం చేశారు. అయితే ఎన్ని నిర్బంధాలు చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌పై తమ పోరు ఆగదని రాంచందర్ రావు తెలిపారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై రాంచందర్‌ రావు స్పందిస్తూ... కాంగ్రెస్ పార్టీ నిన్న వ్యవహరించిన తీరును దేశం మొత్తం చూసిందని అన్నారు. బ్రిటీషర్లు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఇటాలియన్ల నాయకత్వంలో పని చేస్తుందని ఆరోపించారు. ఆ ఇటాలియన్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు బానిసత్వంతో పని చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి వారు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మినహా మరే సాధారణ మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే మనస్తత్వంతో ఉన్నారని ఆరోపించారు. ముస్లీంలకు రిజర్వేషన్ల కోసం, మైనారిటీల ఓట్ల కోసమే కాంగ్రెస్ తాపత్రయం అని విమర్శించారు. ‘‘అక్రమ గృహ నిర్బంధాలతో మహిళల ఆగ్రహాన్ని అణచివేయవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అనుకుంటే, అంతకంటే పొరపాటు మరొకటి లేదు. ప్రధాని మోదీ చిత్తశుద్ధితో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, ఇండి కూటమి తమ మహిళా వ్యతిరేక నైజాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. ఈ చారిత్రక ద్రోహం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహజ్వాలలతో రగిలిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ పితృస్వామ్య, మహిళా వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి నివాస ముట్టడికి నేను పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు నన్ను నా నివాసంలోనే అక్రమంగా గృహనిర్బంధం చేశారు’’ అని రాంచందర్ రావు ఎక్స్‌లో చేసిన పోస్టులోపేర్కొన్నారు.