
పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రంలోని మోదీ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాలంటే, మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా... ఎన్డీయే సర్కార్ ఆ మేరకు మద్దతు సాధించలేకపోయింది. దీంతో ఈ బిల్లు వీగిపోయినట్టుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మిగిలిన రెండు బిల్లులను కూడా వెనక్కి తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో తెలిపారు. అయితే మహిళలకు హక్కులు కల్పించేందుకు మోదీ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం తెలుపకపోవడం ద్వారా... మహిళలను గౌరవించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షం కోల్పోయిందని తెలిపారు. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు లభించేలా చూస్తామని పేర్కొన్నారు. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుపై చర్చ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. అయితే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుపై ఓటింగ్‌లో 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా... 298 మంది మద్దతుగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026కు మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. 489 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా... బిల్లు ఆమోదానికి 326 మద్దతు అవసరం ఉండింది. అయితే అందుకు అవసరమైన మద్దతు లభించకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలో మహిళలకు 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడం... అదే సమయంలో లోక్‌సభ సీట్లను భారీగా పెంచడమే లక్ష్యంగా కేంద్రం మూడు బిల్లులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు... ‘‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’’, ‘‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 2026’’, ‘‘కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026’’. ఇందులో మొదటిది... మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా లోక్‌సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడానికి 131వ రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తుంది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. రెండోది... 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు. ఇక, మూడోది... కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలో కూడా మహిళలకు 33 శాతం కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు.