సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 5వేల దేవాలయాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. ఒక్కో నియోజకవర్గంలో 25 నుంచి 30 వరకు ఆలయాలు నిర్మించే అవకాశం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలి. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవిత్రతతో పాటు పారిశుద్ధ్యమూ ముఖ్యం ‘రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి.ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయి. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ‘దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భక్తి భావంతో దర్శనం చేసుకునే వాతావరణం ఉండేలా చేయడంతో పాటు.. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్తారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్ద ఎత్తున పెరుగుతోంది. ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.20 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.‘శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలకు 55.15 లక్షల మంది భక్తులు సందర్శించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉంది. భక్తులకు తాగు నీటి సౌకర్యం మొదలుకుని అన్నదానం వరకు అన్ని రకాల సేవలను అందించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి. ‘రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.‘ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోంది. దీని కోసం ఏడాదికి రూ. 157.85 కోట్లు వ్యయం అవుతోంది. ఆయా దేవాలయాల్లో పాకశాలల్లో పని చేసే వారికి శిక్షణ ఇప్పించాలి. దేవాలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్దిష్టమైన గడువులోకా సీజీఎఫ్ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. అన్ని రకాల సేవలను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ‘అన్ని ఆలయాలకూ ప్రత్యేక వెబ్‌సైట్లు రూపొందించాలి. సమగ్ర వివరాలతో డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆగమ సలహా మండలి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, స్టాండింగ్ కౌన్సిల్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టండి. ఇంకా పెండింగులో ఉన్న దేవాలయాల పాలక మండళ్లను వెంటనే నియమించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.