
జనం న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చుట్టూ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఇన్నాళ్లూ కల్పించిన అత్యున్నత స్థాయి 'జెడ్ ప్లస్' (Z+) కేటగిరీ భద్రతను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చుట్టూ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఇన్నాళ్లూ కల్పించిన అత్యున్నత స్థాయి 'జెడ్ ప్లస్' (Z+) కేటగిరీ భద్రతను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించిన వెనువెంటనే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం పంజాబ్ ప్రభుత్వానికి, రాఘవ్ చద్దాకు మధ్య పెరుగుతున్న దూరాన్ని స్పష్టం చేస్తోంది. ఈ భద్రతా మార్పుల వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, పార్లమెంటులో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలను ప్రస్తావించడంలో రాఘవ్ చద్దా విఫలమయ్యారని ఆయన సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పార్టీలో అంతర్గత విమర్శలు, మరోవైపు రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి ఆయనను తప్పించడం వంటి పరిణామాలు చాధా రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. పార్లమెంటులో రాఘవ్ చద్దా ప్రదర్శించిన 'నిష్క్రియాత్మకత' పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆప్ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, రాష్ట్ర ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా, కుల్దీప్ సింగ్ ధాలివాల్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాఘవ్ చద్దా మౌనం వహించడం తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. పంజాబ్ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధిగా, జాతీయ స్థాయిలో రాష్ట్ర గళాన్ని బలంగా వినిపిస్తారని ఆశించామని, కానీ ఒక్క సున్నితమైన అంశాన్ని కూడా ఆయన చర్చకు తీసుకురాలేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక నిధుల విషయంలో రాఘవ్ చద్దా వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సుమారు రూ. 8,500 కోట్ల బకాయి ఉన్న గ్రామీణాభివృద్ధి నిధి (RDF), అలాగే రూ. 60,000 కోట్లకు పైగా ఉన్న జీఎస్టీ నష్ట పరిహారం వంటి అంశాలపై ఆయన కేంద్రాన్ని నిలదీయలేదని మంత్రి హర్పాల్ సింగ్ చీమా గుర్తు చేశారు. వీటితో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు, గత ఏడాది వరదల సమయంలో కేంద్రం ప్రకటించిన రూ. 1,600 కోట్ల ఆర్థిక సహాయం రాష్ట్రానికి అందకపోయినా, రాఘవ్ చద్దా పార్లమెంటులో మౌనంగా ఉండటం వరద బాధితుల్లో అసంతృప్తిని నింపిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.