ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.

డీలిమిటేషన్‌కు సూచించిన ఫార్ములా ఇదే!

జనం న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావిం చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో కోరారు. మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌కు ముడిపెట్ట వద్దన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు వేర్వేరు అంశాలని... వాటికి ఒకదానితో ఒకదానికి సంబంధం లేదని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ప్రొ-రేటా విధానం దక్షిణ భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ ఆందోళనలను పరిష్కరించకుండా ముందుకు వెళ్లే ఏ ప్రయత్నమైనా విస్తృత వ్యతిరేకతకు, ప్రతిఘటనకు దారితీస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు, రాజకీయపార్టీల ఏకాభిప్రాయం సాధించాలని అన్నారు. ఎందుకంటే నిష్పక్షపాత ప్రాతినిధ్యం అనే ప్రాథమిక సూత్రానికి సంబంధించినదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే న్యాయబద్ధంగా, సుస్థిరంగా ఉండే పరిష్కారాన్ని సమిష్టిగా సాధించాల్సి ఉందన్నారు. ప్రో రేటా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అనేది అసలైన వివాదాస్పద అంశం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రాజకీయ అధికారాన్ని మార్చి, దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా అసమతుల్యతను సృష్టిస్తుందని చెప్పారు. ప్రో రేటా ప్రతిపాదికన చేపట్టే నియోజకవర్గాల పెంపు ద్వారా దేశ అభివృద్ది కోసం మెరుగైన జనాభా నియంత్రణ, ఆర్థిక పనితీరు కనబరిచినప్పటికీ తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా శిక్షించబడతాయని ఈ లేఖలో ప్రస్తావించారు. అలాగే, అభివృద్ధిని శిక్షించకూడదని... జనాభా పెరుగుదలకు బహుమతి ఇవ్వకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే నియోజకవర్గాల పెంపు చేపడితే....సగం సీట్లను ప్రొ-రేటా పద్ధతిలో, మిగిలిన సగాన్ని ఆర్థిక వాటా (జీఎస్‌డీపీ), ఇతర పనితీరు ప్రమాణాల ఆధారంగా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తద్వారా ఓ కొత్త ప్రతిపాదనను సూచించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే సమయంలో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి... దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ముఖ్యమంత్రులకు కూడా వేర్వేరుగా లేఖలు రాశఆరు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి న్యాయమైన ప్రాతినిధ్యం సాధించేందుకు దక్షిణ రాష్ట్రాలు సుదీర్ఘ పోరాటం చేయాలని కోరారు. ఇక, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా... ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.