సాక్షి డిజిటల్ న్యూస్: శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం నుంచి తిరుపతికి హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు షెడ్యూల్, టైమింగ్, ఛార్జీలు. ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... శ్రీకాకుళం నుంచి తిరుపతికి హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం రోజున ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్-తిరుపతి(17439/17440) హమ్‌సఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల చిరకాల కోరిక నెరవేర్చామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీస్ ప్రారంభమైందని చెప్పారు. త్వరలో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడిచేలా కృషిచేస్తా’ అని పేర్కొన్నారు. అలాగే, త్వరలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పూర్తవుతుందని తెలిపారు. ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రక్షేత్రంతో అనుసంధానం చేస్తుందని. భక్తులకు యాత్రను మరింత సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ నూతన రైలు ప్రారంభించడానికి సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ఎన్డీఏ డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక రైలు సేవ మాత్రమే కాదని. శ్రీకాకుళం ప్రజల ఆశలు, అభివృద్ధిని అనుసంధానించే ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. ఈ కొత్త రైలును ప్రారంభించిన తర్వాత ప్రయాణికలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అయితే శ్రీకాకుళం - తిరుపతి హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్, టైమింగ్, ఛార్జీలు. ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం రోడ్-తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్ ప్రెస్ ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. అలాగే ప్రతి సోమవారం శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలు దేరుతుంది. రైలు నంబర్ 17439... ప్రతి ఆదివారం సాయంత్రం 4.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30కు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17440... ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం. ఈ రైలులో శ్రీకాకుళం నుంచి తిరుపతికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 525, 3ఏ క్లాస్ టికెట్ ధర రూ. 1,385గా ఉంది. ఈ రైలుకు రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి.