
జనం న్యూస్ : మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా... ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావించారని... ఇప్పుడు అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారని అన్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల పెంపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. కులగణన చేస్తామని చెప్పామని... అలా చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే... తమ సీట్లను సాధించుకోవాలని చెప్పారు. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలమని.... ఈ విషయంలో మేధావులు ఆలోచన చేయాలని కోరారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆలోచనే తెలంగాణలో తమ ప్రజాపాలన విధానమని పేర్కొన్నారు. రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ గారు ప్రపంచ దేశాలకు చాటిచెబితే... ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారని చెప్పారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారని తెలిపారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని ప్రజలను కోరారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు. కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.