తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

ఏప్రిల్ 22 నుంచి సేవలు స్థంభించే అవకాశం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. తాము మార్చి 13న సమ్మె నోటీసులు జారీ చేసినప్పటికీ... ఇప్పటివరకు ప్రభుత్వం లేదా ఆర్టీజీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే సమ్మెలోకి వెళ్తున్నట్టుగా తెలిపింది. ఏప్రిల్ 21న అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపేస్తామని, 22న తెల్లవారుజాము నుంచే సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు 32 డిమాండ్లతో కూడిన జాబితాను సమర్పించారని తెలిపారు. ఇందులో ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు, ప్రయోజనాలను కల్పించడం వంటివి ప్రధాన డిమాండ్‌లుగా ఉన్నాయని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే పీఎఫ్ వాటాలు, క్రెడిట్ సహకార సంఘం చెల్లింపుల వంటి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆర్టీసీ ఉద్యోగులు ఏప్రిల్ 22 నుంచి సమ్మెలోకి వెళ్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా సేవలను ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరంచారు. ఇక, గత ఏడాది మే నెలలో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంతో వారు అప్పట్లో తలపెట్టిన సమ్మెను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిన మంత్రి పొన్నం. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ పని చేస్తోందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయని, ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని అన్నారు.