
అక్షర ఆయుధం ; ఏపీ మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు సోమవారం రోజున రాష్ట్రప్రతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.... ఏపీ మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు సోమవారం రోజున రాష్ట్రప్రతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ఎంపీలతో రాష్ట్రపతి మాట్లాడారు. ఇంకా, అమరావతి చరిత్ర-సంస్కృతి-రాజధానిలో పూర్తయిన నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే ఊహాచిత్రాలు, పర్యావరణహిత నిర్మాణ విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమపౌరురాలు సాక్షి సంతకం కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒక్కటై మద్దతు ఇవ్వగా... రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారని చెప్పారు.‘‘అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ అని... తర్వాత 2024లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పనులు పునః ప్రారంభించింది కూడా ఆయనేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేశాం. రాజధాని ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని, గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి వివరించాం.కోట్లాది ప్రజల కోరిక అయిన అమరావతి చట్టం తన హయాంలో రూపొందడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని అమరావతి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు’’ అని మంత్రి నారా చెప్పారు. ఇక, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయసభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్నీ పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లుపై చర్చ జరగగా... అక్కడ కూడా దాదాపు అన్ని పార్టీల మద్దతుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే పార్లమెంట్ ఉభయ సభలలో ఈ బిల్లను వైసీపీ వ్యతిరేకించింది. అయితే పార్లమెంట్ ఉభయసభలలో ఆమోదం పొందిన ఈ బిల్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లను పరిశీలించి ఏప్రిల్ 6న ఆమోదించారు. అదేరోజు రాత్రి ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టం సబ్ సెక్షన్-2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా కేంద్రస్థాయిలో చట్టబద్ధ రక్షణ లభించింది.