మా జోలికి వస్తే గల్ఫ్ పోర్టులు సేఫ్ కాదు

అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

అక్షర ఆయుధం ; అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవులకు ముప్పు వాటిల్లితే ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సోమవారం హెచ్చరించింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రత సమిష్టిగా ఉండాలని... ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని తీసుకునే ఏ చర్య అయినా పొరుగు దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిక జారీ చేసింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. ఈ మేరకు ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి హెచ్చరించినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇరాన్ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే... పర్షియన్ గల్ఫ్ లేదా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఆయన హెచ్చరించారు. ఇక, ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ తాజా హెచ్చరిక జారీ అయింది.ఇదిలాఉంటే, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇరుదేశాలు యుద్దం ముగింపు దిశగా ఒక ఒప్పందానికి రాలేకపోయాయి. దీంతో గత వారం ప్రకటించిన... రెండు వారాల కాల్పు విరమణపై అనిశ్చితి నెలకొంది. అయితే చర్చలు విఫలం కావడానికి ఇరాన్‌ను అమెరికా నిందించగా... మరోవైను అమెరికాను ఇరాన్ తప్పుబట్టింది. అయితే ఈ చర్చలు విఫలం కావడానికి బాహ్య జోక్యమే కారణమని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఈ చర్చల సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుంచి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఫోన్ కాల్ వచ్చిందని... ఇది అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చల పురోగతిని దెబ్బతీసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఆరోపించారు. అయితే ఇరుదేశాల మధ్య రెండు వారాల కాల్పలు విరమణ తర్వాత హర్మూజ్ జలసంధి ద్వారా పరిమిత సంఖ్యలో నౌకల రవాణా పునఃప్రారంభమైందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. సోమవారం ఉదయం 10 గంటలకు (ఇరాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు) హర్మూజ్ దిగ్బంధనం ప్రారంభమవుతుందని... అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని ఇరాన్ ఓడరేవులతో సహా ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలలోకి ప్రవేశించే లేదా బయలుదేరే అన్ని దేశాల నౌకలపై దిగ్భంధాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.అయితే, ఇరాన్ యేతర ఓడరేవుల మధ్య ప్రయాణించే నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతిస్తామని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. తద్వారా మొత్తం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలన్న మునుపటి ప్రతిపాదన నుంచి యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక వెనుకడు వేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించినట్లు తేలిన ఏ నౌకనైనా అమెరికా బలగాలు అడ్డుకుంటాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.