మహిళా బిల్లు పై రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచన

★ మహిళా గౌరవం ముందు రాజకీయాలు అవసరమా? సీఎం ప్రశ్న

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. సోమవారం సచివాలయం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రెండు కూడా వేర్వేరు అంశాలని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీటిని కావాలనే కలిపి గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు అనేవి దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలు. ఇవి కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు కాదని, యావత్ దేశ ప్రజల అస్తిత్వానికి సంబంధించినవని ఆయన గుర్తు చేశారు. కానీ, బీజేపీ మాత్రం ఈ అంశాలను తమ సొంత రాజకీయ ఎజెండాగా మార్చుకుంటూ, ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, చట్టసభల్లో, సమాజంలో వారికి సమాన హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం దేశవ్యాప్తంగా ఒక రకమైన కృత్రిమ హడావిడిని సృష్టిస్తోందని, నిజంగా మహిళలపై గౌరవం ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల నుండే ఈ కోటాను ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. నిజానికి, 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఈపాటికి మరింత మంది మహిళా ప్రతినిధులు చట్టసభల్లో అడుగుపెట్టి ఉండేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం జనాభా లెక్కల వ్యవహారం కాదని, ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం? ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెబుతూనే, ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన ఈ కోటాను తక్షణమే (రాబోయే ఆరు నెలల్లోనే) అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని, ఇది చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాదికి తీరని అన్యాయం చేసే కుట్ర అని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీ సీట్లను పెంచితే, బాధ్యతాయుతంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయం, జీఎస్‌డీపీ అందిస్తున్న ఈ రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, ప్రతిపాదిత 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ఆధారంగా, మిగిలిన 50 శాతం ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా కేటాయించాలని సూచించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు సుమారు 208 అదనపు సీట్లు పెరిగే అవకాశం ఉందని, అలా జరిగితే కేంద్రంలో మెజారిటీ కోసం దక్షిణాది రాష్ట్రాల అవసరం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు, ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన సీఎం, డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపడకూడదని సూచించారు. 2028 వరకు సమయం ఉన్నందున, అన్ని వర్గాలతో చర్చించి, సమగ్రంగా ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.