
జనం న్యూస్ : ప్రభుత్వ హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు... పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ హాస్టల్ గాడిలో పడాలని... అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కనుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘జూన్లో స్కూళ్ల రీ-ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు.. ఆర్వో ప్లాంట్లు సిద్దంగా ఉండాలి. హాస్టళ్లకు సంబంధించి వసతులపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకూడదు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించాం. సాస్కీ నిధులతో ఈ పనులు చేపడుతున్నాం. నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుంది. వసతులను ఏర్పరచడమే కాకుండా... వాటిని సక్రమంగా నిర్వహించేలా కూడా చూడాలి. ఈ మేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం ‘హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు... పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ‘ఇక నగరాలు, పట్టణాల్లో మౌళిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలూ కన్పించకూడదు. తాగునీటి సరఫరా, వీధి దీపాల విషయంలో ఫిర్యాదులు రాకూడదు. అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకంగా మౌళిక సదుపాయల కల్పన విషయంలో ఫిర్యాదులు రాకూడదు. తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి. తాగునీటిని అందించడంతోపాటు.. స్వచ్ఛమైన తాగునీరును... కలుషితం లేని నీటిని ప్రజలకు అందించేలా చూడాలి. తాగునీటి పైప్ లైన్లల్లో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచూ నీటి శాంపిళ్లను కలెక్ట్ చేసి ల్యాబుల్లో టెస్ట్ చేయించాలి. వీధి దీపాలు నిరంతరం పని చేస్తూనే ఉండాలి. సెన్సిటివ్ ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ ఎక్కడా ఆగకూడదు. పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ వంటి అంశాల్లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే మెకానిజం ఉండాలి. పని పూర్తి చేశాక స్థానికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది... మున్సిపల్ అధికారులు స్పందించారనే భావన ప్రజలకు కలిగేలా చేయాలి. మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేయాలి. ఈ మేరకు మున్సిపల్ అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ ఫలితాలు స్పష్టంగా పట్టణాల్లో కన్పించాలి. తాడిపత్రి పట్టణంలో పారిశుద్ధ్యం చక్కగా నిర్వహిస్తారు. అక్కడి నాయకులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేతలు చొరవ తీసుకున్న చోట మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి. స్వచ్ఛత విషయంలో తాడిపత్రి రోల్ మోడల్.’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.