
జనం న్యూస్ : ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేసి ఆదివాసీలు, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని వారికి హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెక్ డ్యాంలు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంపుపై పరిశీలిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మత్తులు ఆలస్యం అవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తెచ్చారు. ఇలాంటి అంశాలపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేసి ఆదివాసీలు, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తదితరులు ఉన్నారు.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ప్రతిపాదనను తీవ్రంగా తప్పుబట్టారు. ‘జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య నిర్ణయం అంగీకరించబోమని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీర్మానించాం. దాంతో ఇంకో రూపంలో దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని ముందుకు తెచ్చారు’సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాజా ప్రతిపాదనల మేరకు 20 స్థానాలున్న కేరళంలో 50 శాతం పెంచితే ఆ రాష్ట్ర స్థానాలు 60 కి చేరుతాయి. అదే ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు 120 కి చేరుతాయి. రెండింటి మధ్య అంతరం 90 స్థానాలవుతాయి.