
జనం న్యూస్ : 2029 ఎన్నికల సమరానికి వైసీపీ సై అంటుంది. వైఎస్ జగన్ ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావిగన్ అంశం, కాపు ఓటర్లను ఆకట్టుకోవడం, క్రిస్టియన్ ఓటర్లను గంపగుత్తగా తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.మరో నాలుగు నెలల్లో రెండేళ్లు పూర్తి చేసుకుని మూడేళ్లలోకి అడుగుపెట్టబోతుంది. అంటే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయితే ఒక ఏడాది గడిస్తే ఇక ఎన్నికల హీట్ మెుదలవుతుంది.అయితే 2029 ఎన్నికల్లోనైనా గెలుపొందాలని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మూడు అస్త్రాలను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకుంటుందని తెలుస్తోంది. అవి ఏంటో ఓసారి తెలుసుకుందాం. వైఎస్ జగన్ ఎన్నికల అస్త్రాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్ట బద్దత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రద్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించినట్లు అయ్యింది.అయితే అదే సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్‘మావిగాన్’అంటూ సరికొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. మావిగన్ కోసం అమరావతి కోసం చేసే ఖర్చులో 10 శాతం ఖర్చు పెడితే చాలు అని అన్నారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ అంగీకరిస్తున్నట్లు కనిపించడం లేదు అనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో మూడు రాజధానులంటూ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చిన జగన్ తాజాగా మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వ్యూహాత్మకంగానే తెరపైకి మావిగన్ 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం అమరావతినే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చింది. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పడతారని దీంతో 2024 ఎన్నికల్లో విజయం తమదేనని వైసీపీ భావించింది. కానీ అది వికటించింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అమరావతిరాజధానిగా చట్టబద్దత కల్పించింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవడం కోసం జగన్ మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వైసీపీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో జగన్ వ్యూహాత్మంగా మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతిలో ఆశించిన మేర అభివృద్ధి జరగకపోయినా....రాజధాని సిద్ధం కాకపోయినా వైఎస్ జగన్ ‘మావిగన్’ప్రాంతాన్ని ఎత్తుకునే అవకాశం ఉంది. తాను ప్రతిపాదించినట్లు మావిగన్‌ను రాజధానిగా చేసి ఉంటే బాగుండేది అని వైఎస్ జగన్ ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా జరగకపోయినా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి జగన్‌కు మావిగన్ ప్రతిపాదన ఉపయోగపడే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది. కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు బిగ్ స్కెచ్ ఇదిలా ఉంటే వైసీపీ రెండో అంశం కాపు సామాజిక వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేందుకు వ్యూహం. అంబటి రాంబాబు అరెస్ట్‌తో కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ కొంత మేర సక్సెస్ అయ్యింది. అలాగే మాజీమంత్రి పేర్ని నాని కుటుంబాన్ని సైతం కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని...కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది అని వైసీపీ ప్రజల్లోకి ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోకి వెళ్తోంది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ వంటి వాళ్లను ముందుండి మరీ తీసుకెళ్తోంది.ఈ క్రమంలో వైసీపీలో కాపు సామాజిక వర్గం నేతలే హైలెట్ అవుతున్నారు. ఇదంతా కాపు సామాజిక వర్గం ఓటర్లను తమ పార్టీ వైపు ఆకర్షించుకోవడలో భాగం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.