హైదరాబాద్‌లో రౌడీషీటర్లపై డ్రగ్స్ పరీక్షలు

★ రౌడీషీటర్లకు డ్రగ్స్ టెస్టులు, 189 మందికి పాజిటివ్ ★ పోలీసుల ప్రత్యేక చర్యలు.. రౌడీషీటర్లలో డ్రగ్స్ వినియోగం వెలుగులోకి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ఆకస్మికంగా రౌడీషీటర్లకు ఆకస్మిక వైద్య పరీక్షలు నిర్వహించగా... 189 మంది గంజాయి సేవించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగం, సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలు సందర్బాల్లో ఆకస్మిక తనిఖీలను సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ పోలీసులు రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పటివరకు పరీక్షించిన 239 మందిలో, సుమారు 189 మంది గంజాయి సేవించినట్లు తేలింది. దీంతో నగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిపై చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక, నగరంలో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్‌లో రౌడీ షీటర్ల నేర కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు డ్రగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ, స్థానిక పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు, మాదకద్రవ్యాల వినియోగదారులకు ఆకస్మిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసుల హెచ్‌-న్యూ టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసుల సమన్వయంతో ఏప్రిల్ 9వ తేదీన మాదకద్రవ్యాల నివారణకు సంబంధించి ఒక స్పెషల్ యాంటీ డ్రగ్ డ్రైవ్‌ను నిర్వహించినట్టుగా నగర పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన పర్యవసానాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేపట్టినట్టుగా చెప్పారు. ఇందులో భాగంగా రౌడీ షీటర్లు, అల్లరి మూకలు, మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా చెప్పారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రి పరిధిలో మొత్తం 239 మందికి పరీక్షలు నిర్వహించగా... వారిలో 189 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయినవారికి మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, రీహాబిలిటేషన్‌పై మానసిక వైద్య నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చినట్టుగా నగర పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించినట్టుగా నగర పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించడం, రీహాబిలిటేషన్‌ చర్యలను ప్రోత్సహించడంతో పాటు, చట్టాలను కఠినంగా అమలు చేయడంలో తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించామని హైదరాబాద్ నగర పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్బాల్లో ఆదేశించారు.