యుద్ధ ప్రభావం

విశాఖలో అధికారుల సాయం కోరిన ఇరాన్ మహిళలు

అక్షర ఆయుధం ; విశాఖపట్నంలో విద్యను అభ్యసించేందుకు వచ్చిన ఇద్దరు ఇరాన్‌ మహిళలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అండగా నిలిచారు. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు తన దృష్టికి రావడంతో ఆర్థిక సాయం అందజేశారు. విశాఖపట్నంలో విద్యను అభ్యసించేందుకు వచ్చిన ఇద్దరు ఇరాన్‌ మహిళలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అండగా నిలిచారు. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు తన దృష్టికి రావడంతో ఆర్థిక సాయం అందజేశారు. విశాఖ జిల్లా సంజీవని నిధి నుంచి రూ. 50,000 చెక్కును, అలాగే శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ పాలక మండలి తరపున మరో రూ. 50,000 నగదును వారికి అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దంతో మిడిల్‌ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌లో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున దాడులు కూడా జరిగాయి. ఈ పరిణామాలతో అక్కడి పరిస్థితులపై ఇతర దేశాల్లో ఉంటున్న ఇరాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లోని తమవారి పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరికి తమ సొంతవారితో సంబంధాలు లేకుండా పోవడంతో తీవ్ర సందిగ్దంలో పడిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సాల్మాజ్‌ మొహ్మది, జీనాబ్‌ మొహ్మది అనే ఇద్దరు ఇరాన్‌ మహిళలు విశాఖ జిల్లా అధికారులను కలిశారు.యుద్ధంతో అట్టుడుకుతున్న తమ స్వదేశం ఇరాన్‌లోని తమ కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ స్పందించారు. వారి అత్యవసర ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 1 లక్షను అందజేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఈ సహాయం అందించారు. ఇందులో రూ. 50,000 జిల్లా సంజీవని నిధి నుంచి, అదనంగా మరో రూ. 50,000 కనక మహాలక్ష్మి దేవస్థానం ద్వారా సమకూర్చారు. ఇక, ఈ క్లిష్ట సమయంలో అద్దె లేదా కళాశాల రుసుముల విషయంలో వారిపై ఎటువంటి ఒత్తిడి రాకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు.సాల్మాజ్‌ మొహ్మది, జీనాబ్‌ మొహ్మది విషయానికి వస్తే... ఆ మహిళలకు పెళ్లిళ్లు అయ్యాయి. వీరిలో ఒకరికి ఇద్దరు పిల్లలు, మరొకరి ఒక బాలుడు ఉన్నారు.