
జనం న్యూస్ : రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సర్వీస్ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించనున్నారు. దీని కోసం కొత్తగా చట్టం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టా దారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు సృష్టించింది. వీటిని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రీ సర్వే 2.0లో భాగంగా ఇప్పటికి 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా... వీటితో 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోంది. సర్వే పూర్తయిన మిగిలిన 1,259 గ్రామాలకు సంబంధించి 9 లక్షల పాసు పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి పంపిణీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి రీ సర్వేతో పాటు...పాసు పుస్తకాల పంపిణీ 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. దీని కోసం నెలవారీ లక్ష్యాలను సిద్ధం చేసుకుని కార్యాచరణ అమలు చేయాలన్నారు. జూలై తరువాత మార్చి లోపు 80 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరగాలని తేల్చి చెప్పారు. తప్పులకు ఆస్కారం లేకుండా పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1.37 లక్షల ఎకరాల భూములకు విముక్తి సచివాలయంలో బుధవారం జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించనున్నారు. దీని కోసం కొత్తగా చట్టం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 2019లో సర్వీస్ ఇనాం భూములకు సంబంధించి నాడు ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... తరువాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్డినెన్స్ మరుగున పడింది. దురుద్దేశంతో గత ప్రభుత్వం దీనిని చట్టంగా మార్చకుండా లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చింది. అయితే ప్రజా ప్రభుత్వం వీరికి న్యాయం చేసేందుకు, సాయంగా నిలిచేందుకు దీనిపై చట్టం చేయాలని నిర్ణయించింది. ఇంటి పట్టా ఉంటే... రిజిస్ట్రేషన్ 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు వరంగా మారనుంది. 2016 ముందు పట్టా కలిగిన యజమాని... నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నిర్ణయం లక్షలాది పేదల కుటుంబాలకు ఆస్తిగా మారుతుంది. అలాగే రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ కింద 13.59 లక్షల ఎకరాల భూమి ఉండగా...ఇందులో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు త్వరలో పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ రెవెన్యూ రికార్డును డిజిటలైజ్ చేయాలని, భూ యజమానికి మొబైల్‌కి సాఫ్ట్ కాపీ పంపించాలని సీఎం అన్నారు. ఈ కేవైసీ అనంతరం రికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రపర్చాలని సీఎం చంద్రబాబు సూచించారు. భూ యజమానులు ఆధార్, ఈ కేవైసీ ఇచ్చి రికార్డ్ లాకింగ్ చేసుకోవచ్చు. దీని కారణంగా ఆయన నాలెడ్జ్ లో లేకుండా రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. ప్రజల భూములకు రికార్డ్ లాకింగ్ రక్షణ కవచంగా ఉంటుంది. సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.