శబరిమల వివాదం మళ్లీ కోర్టులో

రుతుస్రావం అంశంపై జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు

అక్షర ఆయుధం : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ప్రారంభించింది. కేరళంలోని శబరిమల ఆలయంతో సహా పలు మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపైనా, అలాగే పలు మతాలు పాటిస్తున్న మత స్వేచ్ఛ యొక్క పరిధి, విస్తృతిపైనా ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే రుతుస్రావంతో ముడిపడి ఉన్న అంటరానితనాన్ని సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ బీవీ నాగరత్న ప్రశ్నించారు. మరోవైపు శబరిమల ఆలయంలోకి 10 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న రుతుస్రావం అయ్యే మహిళల ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ... ‘‘శబరిమల ఆలయం విషయానికి వస్తే ఆర్టికల్ 17 (అంటరానితనం నిషేధం) గురించి ఎలా వాదించగలరో నాకు అర్థం కావడం లేదు. ఒక మహిళగా చెబుతున్నాను... ప్రతి నెలా మూడు రోజులు అంటరానితనం ఉండి, నాలుగో రోజు అంటరానితనం లేకుండా పోవడం కుదరదు” అని ప్రశ్నించారు.అప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ... శబరిమల ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అక్కడ దైవం బ్రహ్మచారి అని... ఆయన విశిష్టమైన మతపరమైన స్వభావం నుండే ఆ విశ్వాసం, నమ్మకం, ఆచారం ఉద్భవించాయని వాదన వినిపించారు. ‘‘నేను శబరిమల అంశాన్ని నాదైన విభిన్న పద్ధతిలో సమర్థిస్తాను... దీని అర్థం 4 రోజులు కాదు.. ఇది ఒక నిర్దిష్ట వయస్సు వర్గానికి సంబంధించినది. ఈ ఒక ప్రత్యేకమైన ఆలయం మినహా, ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామి ఆలయాలు అన్ని వర్గాల మహిళలకు తెరిచి ఉంటాయి. ఢిల్లీలో మూడు అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి, అవి సంవత్సరంలో 365 రోజులు మహిళలతో సహా అందరికీ తెరిచి ఉంటాయి’’ అని తుషార్ మెహతా వాదనలు వినిపించారు.ఈ విచారణకు ముందు కేంద్రం లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసింది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయస్సు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షను సమర్థించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసి పరిధిలోకి వస్తుందని... ఇది న్యాయ సమీక్ష పరిధికి అతీతమైనదని పేర్కొంది.కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన సమీక్షా పిటిషన్లను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ విచారణలో భాగంగా శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారి వాదనలను వినడానికి కేటాయించారు.