విజయన్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన

★ అభ్యంతరకర వ్యాఖ్యలపై వివాదం: కేరళ సీఎం విజయన్‌కు రేవంత్ రెడ్డి ఘాటు లేఖ

పయనించే సూర్యుడు న్యూస్ : కేరళం సీఎం పినరయి విజయన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై డ్యాష్ మోనే అంటూ తీవ్ర పదాలతో విజయ్ విరుచుకుపడగా...అందుకు ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నేను హుందాగా స్పందించాలనుకున్నా... మీరు మాత్రం అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు అని చెప్పుకొచ్చారు. కేరళం రాష్ట్రం ఇప్ప‌టివ‌ర‌కు సాధించిన విజయాలన్నీ గ‌తంలోని యూడీఎఫ్ ప్ర‌భుత్వాల ప‌నితీరు ఫ‌లితమేననే విష‌యాన్నిగుర్తించాల‌ని కేర‌ళం ముఖ్య‌మంత్రి పిన‌రాయి విజ‌య‌న్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎల్డీఎఫ్ వ‌రుస‌గా రెండు సార్లు ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వాల‌ హయాంలో ఏం జరిగిందో కేరళం ప్రజలకు తెలియజేయాల‌ని సీఎం డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చ‌ర్చ‌కు దిగే ఉద్దేశం త‌న‌కు లేద‌ని కేర‌ళం ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ రాసిన లేఖ‌కు సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌త్యుత్త‌రం రాశారు. కేర‌ళం ప్రభుత్వ పనితీరుపై తాను గౌరవంగా, హుందాగా స్పందించాల‌ని అనుకున్నాన‌ని, కానీ మీ ప్ర‌తిస్పంద‌న‌లో మాత్రం మీరు అభ్యంత‌ర‌క‌ర‌మైన భాషను ఉపయోగించార‌ని విజ‌య‌న్‌ను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. ప్ర‌త్య‌ర్థుల తొందరపాటు వ్యాఖ్యల‌పై తానెప్పుడూ ఆవేశపూరితంగా స్పందించన‌ని సీఎం తెలియ‌జేశారు. మీరు తెలంగాణ‌ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఒక అతిథికి ఇవ్వాల్సిన గౌరవ, మ‌ర్యాద‌ను ఇస్తానని విజ‌య‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టంగా తెలియ‌జేశారు. ప‌దే ప‌దే త‌ప్పుడు ఉదాహార‌ణ‌ నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచిక 2023-24ను ప‌దే ప‌దే తెలంగాణ రాష్ట్రానికి త‌ప్పుడు విధంగా విజ‌య‌న్ ఉదాహారిస్తున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.ఆ స‌మ‌యంలో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న‌ది ప్ర‌స్తుత ప్ర‌జా ప్ర‌భుత్వం కాద‌ని, అది ప‌దేళ్ల బీఆర్ఎస్-బీజేపీ ప‌దేళ్ల దుష్పరిపాలన చివరి దశ అని విజ‌య‌న్‌కు సీఎం తెలియ‌జేశారు. తెలంగాణ‌లో త‌మ ప్ర‌జా ప్రభుత్వం 28 నెలలు పూర్తి చేసుకున్నందున ఈ కాలంలో త‌మ ప‌నితీరు ఆధారంగా త‌మ‌ని అంచనా వేయాల‌ని కేర‌ళం ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.16.12 లక్షల కోట్లుగా నమోదైంద‌ని ఇది 10.7% వృద్ధి రేటుతో జాతీయ సగటు 9.9% కంటే ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ‌ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరుకుంద‌ని, ఈ గ‌ణాంకాల ఆధారంగా తెలంగాణ భారతదేశంలోనే ముందు స్థానంలో నిలిచింద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్ 2024-25 గ‌ణాంకాల‌ ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళం రాష్ట్రాల‌ను తెలంగాణ అధిగ‌మించిద‌న్నారు. పేద‌రికాన్ని నిర్మూలించారా? 2025 చివరి నాటికి తీవ్ర‌ పేదరికాన్ని (ఎక్స‌ట్రీమ్ పావ‌ర్టీ) పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలవనుంద‌ని మీరు ట్వీట్ చేశార‌ని కేర‌ళం ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది 2026 ఏప్రిల్ నెల కానీ మీరు రాసిన లేఖ‌లో 64,006 కుటుంబాలు ఇప్పటికీ పథకాలను పొందుతున్నాయ‌ని పేర్కొన్నందున మీరు పేదరికాన్ని నిర్మూలించారా అని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. 2025 నవంబర్ 1వ తేదీ నాటి మీ ప్రకటన ఎందుకు ఆచ‌ర‌ణ‌లోకి రాలేద‌ని విజ‌యన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆ కేసుల సంగ‌తేంటి? నీతి ఆయోగ్ క‌ర‌ప్ష‌న్ ర్యాంకింగ్‌లను తాను గౌరవిస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే స‌మ‌యంలో విజ‌య‌న్ చెప్పిన‌ట్లు కేరళం ప్ర‌భుత్వం స్వచ్ఛమైనదైతే బంగారు స్మగ్లింగ్ వ్య‌వ‌హారంలో మీ కార్యాలయంలోని ఉన్న‌తాధికారులు, కీల‌కమైన‌ వ్యక్తులకి సంబంధాలున్నాయని డాక్యుమెంట్ల‌తో స‌హా నిరూపించబడిన ఆ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింద‌ని విజ‌య‌న్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్ర‌మ త‌ర‌లింపు ఆరోప‌ణ‌ల‌కు ఎందుకు జ‌వాబు చెప్ప‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. తెలంగాణ రైజింగ్ దార్శనిక‌త‌తో ముందుకు త‌మ‌ ప్ర‌జా ప్ర‌భుత్వం తెలంగాణ రైజింగ్ 2047 దార్శ‌నిక‌త‌తో ముందుకు వెళుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక కారిడార్ వంటివి నిర్మించి ఒక దశాబ్దంలోనే రూ.1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము ముందుకు వెళుతున్న‌ట్లు సీఎం స్ప‌ష్టం చేశారు.అలాగే కేరళంలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం 'నవ కేరళం' దార్శనికతను అమలు చేస్తుందని తాను బ‌లంగా విశ్వ‌సిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళం ప్రజలు త్వరలోనే ఈ మేర‌కు నిర్ణయం తీసుకుంటార‌ని....జ‌ర‌గాల్సినది కూడా అదేన‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.