
సాక్షి డిజిటల్ న్యూస్ : గల్ఫ్ దేశాల్లో ఏదైనా సంక్షోభం ఏర్పడినట్లయితే మన దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందుగానే మేల్కొని పనితీరు ప్రారంభించింది. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ వంటి అవసరాల కోసం గల్ఫ్ దేశాల పైన భారత్ ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మన దేశం 80% పైగా చమురు దిగుమతులను గల్ఫ్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే అందులో భాగంగా ప్రస్తుతం భవిష్యత్తులో భారతదేశం ఇంధనం కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడకుండా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధం అవుతోంది. దీనిని భవిష్యత్తు ఇంధనం అని ఇప్పటికే పిలుస్తున్నారు. భారతదేశం గల్ఫ్ దేశాలపై ఆధారపడకుండా హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించుకునేందుకు ప్రక్రియను ముందుగానే ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశం అవసరాలలో 80% కంటే ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. అయితే గ్రీన్ హైడ్రోజన్ స్థానికంగా తయారు చేయడం ద్వారా ఇతర దేశాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక గేమ్ చేంజర్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా దీనిని స్థానికంగా లభించే నీరు, సౌరశక్తి, పవన విద్యుత్ శక్తులను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రిలయన్స్ వంటి కంపెనీలు పెద్ద మొత్తంలో పరిశోధన, అలాగే ఉత్పత్తి కోసం భారీగా నిధులను కేటాయించాయి. గ్రీన్ హైడ్రోజన్ వల్ల రవాణా రంగంలో భారీ ఎత్తున విప్లవం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రక్కులు, బస్సులు, రైళ్లు, ఓడలు నడిపేందుకు డీజిల్, అలాగే ఫర్నేస్ ఆయిల్ వాడుతున్నారు. దాని బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వాడినట్లయితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెద్ద ఎత్తున తగ్గించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే స్టీల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్, అలాగే ఫెర్టిలైజర్ పరిశ్రమలు సైతం బొగ్గు లేదా న్యాచురల్ గ్యాస్‌ను ఉపయోగించి పరిశ్రమలను నడుపుతున్నాయి. వాటికి బదులుగా గ్రీన్ హైడ్రోజన్ వాడినట్లయితే కాలుష్యం తగ్గిపోవడంతో పాటు డీకార్బనైజేషన్ వల్ల పర్యావరణం కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. దీని లక్ష్యాల విషయానికి వచ్చినట్లయితే భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక గ్లోబల్ హబ్‌గా మార్చాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. దీనివల్ల సుమారు లక్ష కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ విషయంలో కొన్ని సవాళ్లు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనేది ఒక ఖరీదైన ప్రక్రియగా చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా ఈ ప్రక్రియలో ఖర్చు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే హైడ్రోజన్ నిల్వ చేయడం, అలాగే రవాణా చేయడం కూడా ఒక పెద్ద సవాల్ గానే చెప్పవచ్చు.