ఢిల్లీ అసెంబ్లీ వద్ద భారీ భద్రతా లోపం

కారుతో గేటు ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లిన మాస్క్ మ్యాన్

అక్షర ఆయుధం : ఢిల్లీ అసెంబ్లీ వద్ద భారీ భద్రత లోపం వెలుగుచూసింది. ఓ కారు ఢిల్లీ శాసనసభ గేటు నెం. 2ను ఢీకొట్టింది. దీంతో ఇనుప గేటు విరిగిపోయింది. గేటును ఢీకొన్న తర్వాత కారు అసెంబ్లీ ప్రాంగణంలోనికి ప్రవేశించింది. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంగణంలోకి కారు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న భారీ భద్రత ఉల్లంఘన... దేశ రాజధానిలో భద్రత పరిస్థితులపై ఆందోళన రేకెత్తించింది. అసలేం జరిగిందంటే... ఓ ముసుగు ధరించిన వ్యక్తి ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల కారును నడుపుతూ సోమవారం ఢిల్లీ శాసనసభ గేటు నెం. 2ను ఢీకొట్టాడు. దీంతో ఇనుప గేటు విరిగిపోయింది. అనంతరం అతడు స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు తీసుకెళ్లాడు. అక్కడ వరండా దగ్గర ఒక పూలగుత్తిని ఉంచి అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే, స్పీకర్ విజేందర్ గుప్తా కారుపై ఇంక్ కూడా చల్లాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా తన కార్యాలయంలోనే ఉన్నారు. ఈ సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం తిరిగి తన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి ఈ ఘటన జరిగింది. విజేందర్ గుప్తా కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి భద్రతను దాటుకుని ఆయన కార్యాయలం ముందుకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఘటనతో ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘డ్రైవర్ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లి... వరండా దగ్గర ఒక పూలగుత్తిని ఉంచి వెనుదిరిగాడు’’ అని ఢిల్లీ సచివాలయ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేకెత్తించిందని చెప్పారు. అధికారులు దీనిని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ స్పీకర్ కార్యాలయం వద్ద ఉంచి పూలగుత్తిలో ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థం గానీ, అనుమానాస్పద వస్తువు గానీ లభించలేదని సమాచారం. ఢిల్లీ పోలీసులు ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ — 26A సిరీస్ గల టాటా సియెర్రా కారు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వీఐపీ గేటు వద్ద భద్రత కోసం సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. అయితే భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ... ఆ వాహనం బారికేడ్‌ను ఛేదించుకుని నిషేధిత ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలిగిందనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.