నీటి సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రకటించిన

సీఎం చంద్రబాబు నాయుడు

జనం న్యూస్: నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ‘నీటి భద్రత అనేది ప్రభుత్వం బాధ్యతే కాదు.. ప్రజల భాగస్వామ్యమూ ఉండాలి. దీనికి సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి. ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాలి... ప్రతి బొట్టును సంరక్షించుకోవాలి... భూగర్భ జలాలను పెంచాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలి. ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలి’అని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీటిభద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యాచరణ ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై వరకు సాగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఏప్రిల్ 21 నుంచి జూలై 9వ తేదీ వరకు పనులను చేపట్టాలి. జూలై 10 నుంచి 14 జూలై పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి. 100 రోజుల్లో ఈ పనులు చేపట్టాలి.. ఆ తర్వాత వర్షాలు పడతాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. భూగర్భజలాలనూ సంరక్షించుకోవాలి ‘భూగర్భజలాలనూ సంరక్షించుకోవాలి. నీటి భద్రత చేపట్టాలి. రిజర్వాయర్లల్లో నిండుగా నీళ్లున్నాయి గతానికంటే భూగర్భజలాలు పెరిగాయి. వాటర్ సెక్యూర్టీ ఇవ్వగలిగితే.. మిగిలిన రంగాల్లో అభివృద్ధి ఆటోమేటిగ్గా జరుగుతుంది’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ‘తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. వేసవికి ముందు 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. నీటిని నిల్వ చేయాలి. పొదుపు చేయాలి. మైక్రో ఇరిగేషన్ అమలు చేయాలి. ప్రతి చుక్కను సమర్థంగా వినియోగించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. కనీసం 1.5 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ పెంచాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఫీడర్ ఛానెళ్లను క్లియర్ చేయాలి. ‘జలధార అని పేరు పెట్టి అన్నమయ్య జిల్లా నీటి భధ్రత, సంరక్షణ చర్యలను అద్భుతంగా చేపట్టింది. భూగర్భ జలాలను పెద్ద ఎత్తున పెంచారు. స్థానికంగా ఉన్న జలవనరులను వినియోగించుకున్నారు. అన్ని చెరువులను నింపారు. భూగర్భ జలాలు పెంచారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘అన్నమయ్య జిల్లా స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఫీడర్ ఛానెళ్లను క్లియర్ చేయాలి. పూడిక తీత పనులు చేపట్టాలి. గుర్రపు డెక్క తొలగించాలి. చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోవచ్చు. ముంపును అరికట్టవచ్చు. అవసరమైన మేరకు చెక్ డ్యాంలను రిపేర్లు చేయాలి.. కొత్త స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టాలి. భూగర్భజలాలు మరీ తక్కువగా ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్ తయారు చేసుకోవాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 100 రోజుల్లో మిషన్ అప్రోచ్ తో పని చేయాలి ‘ఆయా సాగునీటి సంఘాల పరిధిలో నీటి లభ్యత ఏ మేరకు ఉందో అంచనా వేసుకోవాలి. ఎంత డిమాండ్ ఉందో లెక్కలు వేసుకోవాలి. మైక్రో ఇరిగేషన్ పెంచాలి. వృధాగా నీరు పోకుండా చూడాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘100 రోజుల్లో మిషన్ అప్రోచ్ తో పని చేయాలి. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. కొద్దిపాటి శ్రద్ధగా పెడితే నీటి సమస్య లేకుండా చేయవచ్చు. కరవు రహిత రాష్ట్రంగా మార్చవచ్చు. ఒకప్పుడు రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. ఇప్పుడు హార్టీకల్చర్ హబ్. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా చేపడుతున్నాం. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ హయాంలో చేపట్టాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.