హర్మూజ్‌ను తెరవడానికి 35 దేశాల కసరత్తు

భారత్ ఆహ్వానంపై కేంద్రం స్పందన

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇరాన్‌తో తాము చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడం లేదని నాటో సహా మిత్ర దేశాలపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కాలుగాలిన పిల్లిలా చిందులు వేస్తున్నారు. నాటో నుంచి అమెరికా వైదొలగుతుందని ఆయన బెదిరింపులకు దిగారు. బ్రిటన్ మాత్రం ఈ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖరాఖండిగా చెప్పింది. అవసరమైతే హర్మూజ్ తెరవడానికి దౌత్య మార్గాల్లో ప్రయత్నిస్తామని ప్రకటన చేసింది. దీంతో 35 దేశాలతో సమావేశం నిర్వహిస్తుండగా.. దీనికి భారత్‌ను ఆహ్వానించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాదాపు మూసివేసిన హర్మూజ్ జల సంధిని తెరిపించడానికి యూకే నాయకత్వంలోని 35 దేశాలు ఏర్పాటుచేసిన సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఆ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం జరగబోయే సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వర్చువల్‌గా హాజరవుతారని ఆయన తెలిపారు. ‘ హర్మూజ్ జల సంధి అంశంపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి భారత్ సహా పలు దేశాలను యూకే ఆహ్వానించింది.. భారత తరఫున విదేశాంగ కార్యదర్శి హాజరవుతారు’ అని జైస్వాల్ తెలిపారు. ‘‘చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సహా ఇంధనం మోసుకొచ్చే నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్, ఇతర దేశాలతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం.. గత కొన్ని రోజులుగా జరిపిన చర్చల ఫలితంగా భారత్‌కు చెందిన ఆరు ట్యాంకర్లు హర్మూజ్‌ను సురక్షితంగా దాటాయి.. నిరంతరం సంబంధిత పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచ ఇంధన సరఫరాకు హర్మూజ్ అత్యంత కీలకమైంది. దీని ద్వారానే ప్రపంచ ఐదో వంతు ఇంధనం సరఫరా అవుతుండగా.. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం, ఎల్ఎన్జీలో 50 శాతం, ఎల్పీజీలో 80 శాతం హర్మూజ్ నుంచే వస్తుంది. ఈ జలసంధిని తిరిగి తెరవడం తన కీలక ప్రాధాన్యతలలో ఒకటని చెబుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మాట మార్చారు. యూకేతో సహా అమెరికా మిత్రదేశాలను వారి చమురును వారే సమకూర్చుకోవాలని కోరారు. ఇకపై అమెరికా వారికి సహాయం చేయదని ఆయన నొక్కి చెప్పారు. అమెరికాకు అండగా నిలవని దేశాలకు.. తాము కూడా సహాయం చేయబోమని పేర్కొన్నారు. యూకే వంటి దేశాలకు రెండే మార్గాలున్నాయని ఒకటి ఇంధనం పుష్కలంగా ఉన్న తమ నుంచి ఆయిల్ కొనాలని.. రెండు ధైర్యం ఉంటే హర్మూజ్ దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాలని బెదిరింపులకు దిగారు.