
పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ రాజకీయాల్లో సూపర్ ట్విస్ట్. లోక్‌సభలో చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టారు.ఈ అమరావతి బిల్లుకు కాంగ్రెస్ జై కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ కీలక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించేందుకు స్పీకర్ ఓంబిర్లా గంట సమయం కేటాయించారు. అవసరమైతే మరో గంట చర్చను పొడిగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 28న ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధతపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ సభలో మాట్లాడుతూ.. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా పెండింగ్‌లో ఉందని, ఏపీకి జరిగిన అన్యాయంపై తాము మౌనంగా ఉండలేమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల తరహాలో అమరావతి కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ఆకాంక్షించింది. అమరావతి ప్రాంతానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు వివిధ పార్టీల ఎంపీలు సిద్ధమయ్యారు. బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన నుండి బాలశౌరి, వైసీపీ నుండి మిథున్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో అమరావతి బిల్లుపై మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, పోరాడిన మహిళల త్యాగాలను కొనియాడారు. గత ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో అణచివేతకు పాల్పడిందని, ఆ కన్నీళ్లే నేడు అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లుకు పునాది అని ఆయన స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ మాత్రం అమరావతి బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. లోక్‌సభలో చర్చ ముగిసిన తర్వాత మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించనున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. రాజధాని అంశంపై గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడనుంది. అమరావతికి చట్టబద్ధత లభిస్తుండటంతో అటు రైతులు, ఇటు ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.