ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

సాక్షి డిజిటల్ న్యూస్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, గతంలోని లోపాలను సరిదిద్ది సామాన్యులకు, రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విటాయిపల్లిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... భూభారతి పోర్టల్ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టుగా తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విటాయిపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన గ్రామసభ వేదికగా ప్రారంభించినట్టుగా తెలిపారు. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ నంబర్‌ను కేటాయిస్తారని తెలిపారు. దీనివల్ల భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు. ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్‌ను కూడ జత చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలికి, అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చనట్టుగా తెలిపారు. ఇందుకోసం 5,300 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో10.984 రెవెన్యూ గ్రామాల‌ను క్ల‌స్ట‌ర్లు గా విభ‌జించి జీపీవోల‌ను నియ‌మించామని చెప్పారు. కొత్త ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లో ఆన్‌లైన్ ద్వారా భూ వివరాలను అప్‌లోడ్ చేస్తే చాలు.. 24 నుంచి 48 గంటల్లో సర్వేయర్ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. వారం రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని... డాక్యుమెంట్లు యజమానుల ఇంటి అడ్రస్‌కే నేరుగా చేరతాయని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక జీఓను కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఇకపై అమ్మిన వారి 'కన్సెంట్' కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, కొనుగోలు చేసిన రైతుల స్వంత డిక్లరేషన్‌తో భూమి రిజిస్ట్రేషన్ అయ్యేలా నిబంధనలు సులభతరం చేసినట్టుగా చెప్పారు. గతంలో మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయితీలకు ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉండేది కాదని... భూభారతి ద్వారా ఈ అడ్డంకిని తొలగించి అన్ని ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ మ్యాప్‌తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందించడం ద్వారా దొంగ పాస్ బుక్కులు రద్దవుతాయని అన్నారు. నిజంగా భూమి ఉన్నవారికి పాస్ బుక్ వస్తుందని చెప్పారు. ఈ విధంగా మ్యాప్ లను అందించడం వల్ల భవిష్యత్‌లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈరోజున అమ‌న‌గ‌ల్ మండ‌లంతోపాటు కుసుమంచి, అశ్వ‌రావుపేట‌, వ‌ట్‌ప‌ల్లి, కొస్గి మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను 45రోజుల త‌ర్వాత అవ‌స‌ర‌మైన మార్పులు, చేర్పుల‌తో 2వ‌ద‌శ‌లో జిల్లాకో మండ‌లంలో ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.