ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

జనం న్యూస్: ఒంటిమిట్ట కోదండ రాముడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, మనవడు దేవాన్ష్‌తో కలిసి దర్శించుకున్నారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం...సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు స్వామి వార్ల చిత్రపటాన్ని అందించి ప్రసాదాలను అందించారు. అనంతరం జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ‘మనందరికీ ఈ రోజు చాలా పవిత్రమైనది. సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం మనందరి అదృష్టం. వేంకటేశ్వరస్వామి కూడా మన రాష్ట్రంలోనే కొలువై ఉండటం గొప్పవరం. రాష్ట్రం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని, రాముడు రామరాజ్యాన్ని అందించినట్లుగానే కూటమి పాలన సాగేలా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నా’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘ప్రజలకు సందప, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని శ్రీరాముణ్ని ప్రార్థించా. సమైక్య రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమి జరుపుకునేవాళ్లం. విభజన తర్వాత ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ రోజు లోక్‌సభలో అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. నాడు అమరావతి రాజధానిగా దేవేంద్రుడు పాలిస్తే. నేడు ప్రజారాజధానిగా అమరావతి ఉంది. రాముడు రామరాజ్యాన్ని ఇచ్చినట్లుగానే రాముడి ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీకు అండగా ఉంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం అంతకుముందు ఒంటిమిట్టలో హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. టీటీడీ గెస్ట్ హౌస్‌ వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. ఈ విహంగ వీక్షణం ద్వారా ఒంటిమిట్ట ఆలయ పరిసర ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి, విస్తరణకు ప్రణాళికలు అమలు చేసే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు మరోవైపు ఒంటిమిట్ట కోదండ రాముడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, మనవడు దేవాన్ష్‌తో కలిసి దర్శించుకున్నారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.